Begin typing your search above and press return to search.

బీజేపీకి సుజనా చౌదరి సవాల్

By:  Tupaki Desk   |   27 July 2016 7:37 AM GMT
బీజేపీకి సుజనా చౌదరి సవాల్
X
ఏపీ ప్రత్యేక హోదా అంశం మిత్రపక్షాలు బీజేపీ - టీడీపీ మధ్య వేడిని పెంచుతోంది. బీజేపీపై మరోసారి తలపడేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేవపెట్టిన ప్రయివేటు బిల్లు నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం సమావేశమైన టిడిపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ సాగింది. సమావేశం అనంతరం కేంద్రమంత్రి సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వానికి సవాల్ కూడా విసిరారు. ఏపీకి కేంద్రం ఇంతవరకు ఏమేం ఇచ్చిందో బ్యాలన్సు షీట్ బయటపెడతామని.. అందుకు సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు. దీంతో ఒక్కసారిగా వేడి పెరిగింది.

ఏపీకి కేంద్రం ఏమేం ఇచ్చిందన్న విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ - హోంశాఖలు వివరాలు వెల్లడించాలని సుజనా డిమాండ్ చేశారు. కేవీపీ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతుందని ఆయన ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పని చేస్తామని.. అది పార్టీలకతీతంగా ఉంటుందని చెప్పారు. ఏపీకి కేంద్రం ఇప్పటిదాకా ఏం చేసింది, ఇంకా ఏం చేయాలనే విషయమై సభలో చర్చించేందుకు సిద్ధమన్నారు. అవకాశం ఇస్తే రాజ్యసభలో అన్ని అంశాలను చర్చిస్తామని చెప్పారు.

బీజేపీ తమకు మిత్రపక్షం అయినందున ఆ పార్టీ మిత్రధర్మం పాటిస్తుందో లేదో స్పష్టం చేయాలని సుజనా అన్నారు. రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలన్నారు. ఈ రెండేళ్లలో కొన్ని విషయాల్లో తాము అసంతృప్తితో ఉన్నామని కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేశారు. అయితే.. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో.. ఆ సవాల్ ను ఎలా స్వీకరిస్తారో చూడాలి.