Begin typing your search above and press return to search.

సుజనా సంచలనం.. రాజధానిని కదల్చటానికి వీల్లేదట!

By:  Tupaki Desk   |   29 Dec 2019 7:53 AM GMT
సుజనా సంచలనం.. రాజధానిని కదల్చటానికి వీల్లేదట!
X
ఏపీలో మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సాగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. మూడు రాజధానుల మీద వ్యతిరేకించేవారు.. అనుకూలంగా వాదనలు వినిపిస్తున్న వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. మూడు రాజధానులు తప్పనిసరి అని.. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖగా తేల్చటం ఖాయమన్న మాట బలంగా వినిపించటం.. దీనికి తగ్గట్లే నిన్న విశాఖకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడి వారు ఘనంగా స్వాగతం పలికారు. ఇదంతా చూస్తే.. వైజాగ్ కు రాజధాని షిఫ్ట్ అవుతుందన్న భావన కలుగక మానదు.

ఇలాంటివేళ.. అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి. రాజధాని మారే ప్రసక్తే లేదని.. అమరావతి అంగుళం కూడా కదలటానికి వీల్లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో మాట్లాడిన తర్వాతనే తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన చెప్పటం గమనార్హం. మూడు రాజధానుల ప్రస్తావన అర్థం కావటం లేదన్న ఆయన.. రాజధాని విషయంలో స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్నా.. కేంద్రానికి ఉన్న హక్కు ఏమిటన్నది సరైన సమయంలో వెల్లడిస్తామని చెప్పటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజధాని మార్పుతో కొత్త సమస్యలు వచ్చి పడతాయంటూ ఆయన చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ వినిపించని వాదనను ఆయన వినిపిస్తున్నారు. రాజధాని మార్చిన పక్షంలో రూ.80 నుంచి రూ.90 వేల కోట్ల వరకూ పరిహారంగా చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని.. అంత డబ్బు లేదనే ఏపీ సర్కారు ఈ పరిమారం మాటేమిటి? అన్న ప్రశ్న తలత్తేలా సుజనా తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.

మూడు రాజధానుల ప్రతిపాదనను తప్పు పట్టటం.. కేంద్రంతో మాట్లాడి తాను మాట్లాడుతున్నట్లు చెప్పిన సుజనా మాటలు చూస్తుంటే.. తెర వెనుక తన ఎక్స్ బాస్ వాణిని వినిపిస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు. అమరావతిని స్వాగతిస్తూ 30వేల ఎకరాలు చాలని నాడు విపక్ష నేతగా జగన్ చెప్పిన విషయాన్ని సుజనా తాజాగా గుర్తు చేశారు. చూస్తుంటే.. ఏపీ సర్కారును బద్నాం చేయటమే లక్ష్యంగా సుజనా మాటలు ఉన్నాయని చెబుతున్నారు. సుజనా వ్యాఖ్యలపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఈ వ్యాఖ్యలపై ఏపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.