Begin typing your search above and press return to search.

సుజ‌నా స్పీచ్ కు మోడీ స‌ర్కార్ సెన్సార్‌?

By:  Tupaki Desk   |   15 March 2018 4:49 AM GMT
సుజ‌నా స్పీచ్ కు మోడీ స‌ర్కార్ సెన్సార్‌?
X
నిన్న‌టి వ‌ర‌కూ మోడీ మంత్రివ‌ర్గంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించి.. బాబు ఆదేశాల‌తో ప‌ద‌వికి రాజీనామా చేసిన టీడీపీ కీల‌క నేత సుజ‌నా చౌద‌రి తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా.. విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంపై మోడీ స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్న తెలుగు త‌మ్ముళ్లు.. గ‌డిచిన కొద్దిరోజులుగా పార్ల‌మెంటును త‌మ ఆందోళ‌న‌ల‌తో స్తంభింప‌చేస్తున్నారు.

తాజాగా త‌మ పార్టీ నేత‌ల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడిన సుజ‌నా.. మోడీ స‌ర్కారుపై ఆరోప‌ణ‌లు చేశారు. అదే స‌మ‌యంలో యూపీలో బీజేపీకి త‌గిలిన ఎదురుదెబ్బ విష‌యంలో ఆచి తూచి రియాక్ట్ కావ‌టం గ‌మ‌నార్హం. ఓప‌క్క యూపీలో బీజేపీ ఓట‌మిపై అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఉన్న‌ది ఉన్న‌ట్లుగా వ్యాఖ్యానిస్తే.. సుజ‌నా మాత్రం త‌మ‌కు త‌మ రాష్ట్రం త‌ప్పితే.. వేరే రాష్ట్రం గురించి ప‌ట్టించుకోమంటూ మాట దాటేయ‌టం గ‌మ‌నార్హం.

ఇక‌.. మోడీ స‌ర్కార్ పై సుజ‌నా చేసిన ఆరోప‌ణ‌ల్ని చూస్తే.. మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన వారికి స‌భ‌లో మాట్లాడే అవ‌కాశం ఉంటుంద‌ని.. కానీ మోడీ స‌ర్కారు ఆ అవ‌కాశం కూడా క‌ల్పించ‌కుండా దారుణంగా వ్య‌వ‌హ‌రించింద‌న్నారు. త‌న‌తో పాటే కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన అశోక్ గ‌జ‌ప‌తి రాజుతో స‌హా ప‌లువురు టీడీపీ ఎంపీల‌తో క‌లిసి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన సుజ‌నా.. ప‌వ‌న్ ఏం మాట్లాడారో తాను చూడ‌లేద‌న్నారు.

పార్ల‌మెంటులో త‌మ నోరు నొక్కేశారంటూ మోడీ స‌ర్కారుపై తీవ్ర ఆరోప‌ణ చేసిన సుజ‌నా.. రాజ్య‌స‌భ నిబంధ‌న 241.. లోక్ స‌భ నిబంధ‌న 199 ప్ర‌కారం రాజీనామా చేసిన మంత్రులు స‌భ‌లో మాట్లాడే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. కానీ.. మోడీ స‌ర్కారు అందుకు అంగీక‌రించలేద‌న్నారు. త‌మ‌కు ప్ర‌సంగించే అవ‌కాశం ఇవ్వాల‌ని నోటీసులు ఇచ్చామ‌ని.. ఇందుకు ప్ర‌తిగా మీరు ప్ర‌సంగం చేయ‌టానికి వీల్లేద‌ని.. ముందుగా సిద్ధం చేసిన ప్ర‌సంగాన్ని చ‌ద‌వాల‌ని.. దాన్ని ముందుగా త‌మ‌కు ఇవ్వాల‌ని చెప్పిన‌ట్లుగా సుజ‌నా చెప్పారు.

త‌మ స్పీచ్ కు సంబంధించిన ముసాయిదాను వారి చేతికి ఇచ్చామ‌ని.. దాన్లోని అంశాల‌కు కోత పెట్టార‌ని.. బాధ్య‌త క‌లిగిన కేంద్రం ఇలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని త‌ప్పు ప‌ట్టారు. విభ‌జ‌న చ‌ట్టంలో చెప్పిన దానికి మించి ఒక రూపాయి కూడా అడ‌గ‌లేద‌ని తేల్చి చెప్పారు. మ‌రి.. స‌భ‌లో మాట్లాడేందుకు మోడీ స‌ర్కారు ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌న‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. పార్ల‌మెంటు న‌డుపుకోవ‌టానికి త‌మ‌ను పిలుస్తారే త‌ప్పించి.. విభ‌జ‌న ప‌రిష్కారాలు తీర్చేందుకు ఒక్క‌సారి కూడా త‌మ‌ను పిల‌వ‌లేద‌న్నారు. ఓప‌క్క మోడీ స‌ర్కారు తీరును త‌ప్పుప‌డుతూనే.. మిత్రుడికి ఇబ్బంది క‌లిగించే యూపీ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి మాత్రం మాట్లాడ‌లేక‌పోతున్న సుజ‌నా తీరు చూస్తే.. మోడీ విష‌యంలో తెలుగు త‌మ్ముళ్ల ఆచితూచి ధోర‌ణి ఒక ప‌ట్టాన అర్థం కాని ప‌రిస్థితి. ఇంత‌కీ.. మోడీఅండ్ కో విష‌యంపై తెలుగు త‌మ్ముళ్లు ఎందుకంత ఆచితూచి ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు?