Begin typing your search above and press return to search.

బాబుకు జైలుపై బీజేపీ అలా.. సుజ‌నా ఇలా!

By:  Tupaki Desk   |   15 July 2019 5:16 AM GMT
బాబుకు జైలుపై బీజేపీ అలా.. సుజ‌నా ఇలా!
X
మోడీని ఓడించ‌ట‌మే ధ్యేయంగా.. రాష్ట్రాల చుట్టూ తిరిగి.. నాయ‌కుల్ని పోగేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు భ‌విష్య‌త్తు ఎలా ఉంటుంది? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఓవైపు క‌ర‌డుగ‌ట్టిన బీజేపీ నేత‌లంతా బాబుకు జైలు ఖాయ‌మ‌న్న మాట‌ను చెప్పేందుకు అస్స‌లు మొహ‌మాట ప‌డ‌కుండా చెప్పేస్తుంటే.. ఈ మ‌ధ్య‌నే బీజేపీ తీర్థం తీసుకున్న బాబుకు జిగిరీ దోస్త్ సుజ‌నా చౌద‌రి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. ఐదేళ్ల బాబు పాల‌న‌లో వ్య‌వ‌స్థ‌ల‌న్ని ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. నిధులు ప‌క్క‌దారి ప‌ట్టిన‌ట్లుగా పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో బాబు చేసిన త‌ప్పుల‌కు జైలు త‌ప్ప‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. టీడీపీ నుంచి బీజేపీలోకి ఈ మ‌ధ్య‌నే జంప్ అయిన సుజ‌నాచౌద‌రి.. పార్టీ మారిన త‌ర్వాత తొలిసారి ఏపీకి వ‌చ్చారు. ఫ‌క్తు బీజేపీ నేత‌గా మాట్లాడిన సుజ‌నా మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

స్వ‌తంత్ర భార‌తదేశ చ‌రిత్ర‌లో ఏ రాష్టానికి ఇవ్వ‌న‌న్ని నిధులు మోడీ ప్ర‌భుత్వం ఏపీకి ఇచ్చినట్లుగా చెప్పిన సుజ‌నా చౌద‌రి.. ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయంగా చెప్పారు. ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం సాధ్యం కాద‌న్న ఆయ‌న‌.. టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు మోడీ స‌ర్కారు జైల్లో పెడుతుంద‌ని తాను అనుకోవ‌టం లేద‌న్నారు.

అయితే.. ఏదైనా అంశంపై నిజాయితీగా విచార‌ణ జ‌రిపిస్తే మాత్రం చెప్ప‌లేమ‌న్నారు. గ‌త ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డిందా? అన్న ప్ర‌శ్న‌కు విచార‌ణ జ‌రిపిస్తే మాత్ర‌మే స‌మాధానం చెప్ప‌గ‌ల‌మ‌న్నారు. ఐదేళ్ల బాబు పాల‌న‌లో గాడి త‌ప్పింద‌ని మాత్రం తాను చెప్ప‌గ‌ల‌న‌న్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్రం ఏపీకి ఎలాంటి అన్యాయం చేయ‌లేద‌న్నారు.

సుజ‌నా మాట‌కు భిన్నంగా బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల స‌హ ఇన్ ఛార్జ్ సునీల్ దేవ‌ధ‌ర్ వ్యాఖ్య‌లు ఉన్నాయి. సుజ‌నాకు నిర్వ‌హించిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాయ‌న‌.. గ‌డిచిన ఐదేళ్ల‌లో బాబు స‌ర్కారులో టీడీపీ నేత‌లు కోట్లాది రూపాయిలు లూటీ చేశార‌న్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అనేవార‌న్నారు. త‌న మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం కావ‌టంతో పాటు.. చంద్ర‌బాబు కాంగ్రెస్ తోనూ క‌లిసిపోయార‌న్నారు. బీజేపీ స‌హ‌కారం లేకుండా చంద్ర‌బాబు ఎప్పుడు అధికారంలోకి రాలేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

ఓప‌క్క బీజేపీ నేత‌లేమో బాబుకు జైలు త‌ప్ప‌ద‌న్న మాట మాట్లాడుతుంటే.. మ‌రోవైపు సుజ‌నా మాత్రం మోడీ స‌ర్కారు త‌న ఎక్స్ బాస్ కు జైలు ఉంటుంద‌ని తాను అనుకోవ‌టం లేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఒక‌ప్ప‌టి పాత బాస్ కు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా ఈ శిష్య ప‌ర‌మాణువు ఏమైనా సాయం చేయ‌నున్నారా? ఈ ప్ర‌శ్న‌కు కాలం మాత్ర‌మే స‌రైన స‌మాధానం చెప్ప‌గ‌ల‌దు.