Begin typing your search above and press return to search.

సుజనా.. మోడీని పొగిడినట్టా? తిట్టినట్టా?

By:  Tupaki Desk   |   9 Sep 2015 3:57 AM GMT
సుజనా.. మోడీని పొగిడినట్టా? తిట్టినట్టా?
X
రాజుగారి పెద్దభార్య చాలా మంచిది అంటే దాని అర్థం ఏమిటి? తెలుగు సామెతలతో పరిచయం ఉన్న పిల్లలు కూడా చెప్పేయగలరు.. 'చిన్నభార్య చెడ్డది అని అర్థం'!! అంటే మనం ఒక వాక్యం చెబితే దానికి మరో అర్థం కూడా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాటలకు వస్తున్న అర్థాలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతున్నారో తిడుతున్నారో కూడా అర్థంకాని విధంగా స్పందిస్తున్నారు.

కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రస్తుతం అమెరికాలో చాలా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలకులుగా ఉన్నందువలన.. అభివృద్ధి పథంలో మనం దూసుకెళ్లిపోతామనే నమ్మకం ప్రతి ఒక్కరికీ కలుగుతున్నదని ఆయన జనాంతికంగా ఒక డైలాగు వేసేశారు. అదే సమయంలో.. ఆయన చేసిన కీలకమైన వ్యాఖ్య ఏంటంటే.. మోడీ ప్రధాని అయిన తరువాత.. ప్రపంచదేశాలలో భారత ప్రతిష్ట చాలా పెరిగిందిట. విదేశాల్లో ప్రతిష్ఠ పెరిగిందంటే దాని అర్థం స్వదేశంలో పలచబడిపోయిందనేనా అని జనం జోకులేసుకుంటున్నారు.

నిజానికి ఇప్పటికే మోడీ విదేశీ టూర్ల మీద ప్రజల్లో సెటైర్లు ఎక్కువైపోయాయి. ప్రధాని అయిన నాటి నుంచి స్వదేశంలో గడిపిన రోజులకంటె విదేశాల్లో గడిపిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ విపక్షాలు ఆయన తీరును ఎండగడుతున్నాయి. మోడీ ఆ విమర్శలేవీ ఖాతరు చేయకుండా ఒక దేశం నుంచి తిరిగి రాకముందే.. మరో దేశానికి వెళ్లే టూరు షెడ్యూలును ఖరారు చేసుకుని సిద్ధమవుతున్నారు. ఆ నేపథ్యంలో సుజనాచౌదరి మాటలు.. మోడీ మీద వెటకారం లాగా కూడా ధ్వనిస్తున్నాయా అని కొందరు అంటున్నారు. నిజానికి సుజనా చౌదరి చాలా విధేయుడైన మంత్రి గనుక.. ఆయన మనస్ఫూర్తిగానే మోడీని కీర్తించి ఉంటారని.. కానీ ఆ మాటల అర్థం.. ఆయన మీద సెటైరు కూడా ధ్వనిస్తున్నదని జనం అనుకుంటున్నారు.