Begin typing your search above and press return to search.

సుజనా మాట..టీడీపీ ఓటమికి అమరావతే కారణమట!

By:  Tupaki Desk   |   30 Dec 2019 1:30 AM GMT
సుజనా మాట..టీడీపీ ఓటమికి అమరావతే కారణమట!
X
మొన్నటి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్థానం ప్రారంభించి 40 ఏళ్లు కావస్తున్న ఆ పార్టీకి మొన్నటి ఓటమి... గతంలో ఏనాడూ జరగని పరాభవమే. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో పోటీచేసిన ఆ పార్టీ కేవలం 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లలో మాత్రమే గెలిచింది. అంతేనా... ఏపీలో మొత్తం 13 జిల్లాలు ఉంటే... టీడీపీ ఏకంగా నాలుగు జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవని పరిస్థితి. ఇంతటి ఘోర పరాభవం దక్కిన నేపథ్యంలో... అసలు తాను ఏం తప్పు చేశానని ఇన్ని సీట్లే ఇచ్చారంటూ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మదనపడిన తీరు కూడా ఆసక్తి రేకెత్తించింది. టీడీపీ ఓటమికి ఇప్పటికీ తనకు కారణాలు తెలియడం లేదని కూడా చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించారంటే... ఈ ఓటమి అటు టీడీపీతో పాటు ఇటు చంద్రబాబును ఎంత కలవరపాటుకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ ఓటమి కారణం ఇదేనంటూ... మొన్నటిదాకా ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగి ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో చేరిపోయిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఏపీ పర్యటనలో ఉన్న సుజనా.... ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన టీడీపీ ఓటమికి కారణం నవ్యాంధ్ర రాజధాని అమరావతేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంచుకుని, ఆపై నిర్మాణం విషయంలో ఆలస్యం చేసినందునే ప్రజలు టీడీపీని ఓడించారని సుజనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కొంప ముంచింది రాజధానేనని కూడా ఆయన తేల్చేశారు. కేంద్రానికి చెందిన 130 సంస్థలకు భూములను ఇచ్చినా, నిర్మాణాలు జరగలేదనిఆయన చెప్పుకొచ్చారు. అయితే అమరావతిలో ఎన్నో నిర్మాణాలు కొనసాగుతున్నట్టు చెప్పారు. విద్యాసంస్థలు మాత్రం రాజధానికి వచ్చాయని... అయితే వాటితోనే రాజధాని పూర్తిగా అభివృద్ధి చెందినట్టు కాదు కదా అని కూడా సుజనా తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.

మొత్తంగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమికి పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్న కోణంలో సుజనా అసలు సిసలు కారణాలు వెలిబుచ్చారని చెప్పక తప్పదు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తీరును, ఆపై రాజధాని నిర్మాణంలో జరిగిన జాప్యానికి కారణం కూడా చంద్రబాబేనన్న కోణంలో సుజనా సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. అంటే... తెలిసి చేసినా, తెలియక చేసినా... చంద్రబాబు చేసిన తప్పు కారణంగానే టీడీపీ పుట్టి మునిగిందని సుజనా తేల్చేశారన్న మాట. మొత్తంగా టీడీపీ ఓటమికి కారణం ఇదేనంటూ సుజనా చేసిన వ్యాఖ్యలు పెను కలకలంగానే మారాయని చెప్పక తప్పదు.