Begin typing your search above and press return to search.

టీడీపీపై సుజ‌నా ఆప‌రేష‌న్ స్టార్ట్‌!

By:  Tupaki Desk   |   12 July 2019 6:31 AM GMT
టీడీపీపై సుజ‌నా ఆప‌రేష‌న్ స్టార్ట్‌!
X
ఏపీలో బిజెపి రోజు రోజుకు తన అకౌంట్‌ పెంచుకునే పనిలో బిజీ బిజీ అయిపోతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసిన కాషాయ దళం ఆ పార్టీ నుంచి ఎవరు వచ్చినా వారికి కండువాలు కప్పివేస్తోంది. ముందుగా టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్లడంతో ప్రారంభమైన ఈ వలసల ప్రస్థానం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు.... తాజా ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు సైతం బిజెపి గూటికి చేరి పోతున్నారు. వరదాపురం సూరి లాంటి నేతలు పార్టీ మారిపోగా... ఇప్పుడు రాజధాని జిల్లా అయిన గుంటూరు నుంచి కూడా పలువురు కీలక నేతలు బిజెపి బాటలో ఉన్న సంగతి తెలిసిందే.

జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి కూడా బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు గత నెల రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక జిల్లా టిడిపిలో పలువురు కీలక నేతలపై వల వేసిన బీజేపీ అధిష్టానం వాళ్ళను పార్టీలోకి చేర్చే బాధ్యతను రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అప్పగించినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి గత రెండు ఎన్నికల్లోనూ జిల్లాలో కొందరికి టిక్కెట్లు ఇవ్వడం ద్వారా తన వర్గంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వారిని బిజెపిలోకి లాగే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నేత‌ల బలహీనతలను గుర్తించి వ్యూహాత్మకమైన మైండ్‌ గేమ్ ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ... బాపట్ల టిడిపి ఇన్చార్జ్ అన్నం సతీష్ ప్రభాకర్ ఏకంగా పార్టీతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు అన్నం సతీష్‌ కు రెండుసార్లు బాపట్ల అసెంబ్లీ సీటు ఇచ్చారు. రెండుసార్లు కూడా ఆయన ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినా సుజనా చౌదరితో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఆయన టిడిపిని వీడుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో సుజనా చౌదరితో ఎంతో సన్నిహితంగా ఉండే ఇద్దరు టిడిపి సీనియర్లు సైతం బిజెపిలో చేరే అంశంపై ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇద్దరు సీనియర్లు కూడా టిడిపిని వీడితే జిల్లాలో టీడీపీకి అదిరిపోయే షాక్ తగిలినట్టే. ఇక తాజాగా గతంలో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన టిడిపి నేత టీవీ రావు కూడా ఇప్పటికే బిజెపిలో చేరి పోయారు. ఇక పార్టీకి చెందిన మరో సీనియర్ నేత... గతంలో దుగ్గిరాల నుంచి పోటీ చేసి ఓడిన సాంబశివరావు కూడా పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి జిల్లాలో గెలిచిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సైతం ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలిశారని... ఆయన కూడా త్వరలోనే పార్టీ మారిపోతారని ప్రచారం జ‌ర‌గ‌గా దానిని ఖండించారు. అనగానే ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న ఆయనకున్న వ్యాపారాల‌ నేపథ్యంలో రేపోమాపో అయినా బిజెపి గూటికి వెళ్లిపోవచ్చని తెలుస్తోంది. ఏదేమైనా జిల్లాలో టీడీపీని సుజ‌నా పూర్తిగా న‌ట్టేటా ముంచే వ‌ర‌కు వ‌దిలేలా లేరు.