Begin typing your search above and press return to search.

లోకేశ్ ను చూసి భయపడుతున్న సుజనా

By:  Tupaki Desk   |   14 Jan 2016 11:23 AM GMT
లోకేశ్ ను చూసి భయపడుతున్న సుజనా
X
ఏసీ సీఎం కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను చూసి కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి భయపడుతున్నారు. తన మంత్రి పదవికి పొగపెట్టేది లోకేశేనని ఆయన ఆందోళన చెందుతున్నారు.

లోకేశ్ కేంద్ర మంత్రి పదవే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని సుజనా భావిస్తున్నారు. తనకు ఎలాగూ సెగ తప్పదని అర్తం చేసుకున్న ఆయన ప్రత్యామ్నాయ అవకాశాల కోసం చూస్తున్నారు. మరోవైపు లోకేశ్ జాతీయ స్థాయిలో తన గురించి ప్రచారం చేయించుకునేందుకు ప్రత్యేకంగా సహాధ్యాయి సీతేపల్లి అభీష్టను ఢిల్లీలో నియమించుకున్నారు. గత సాధారణ ఎన్నికలకు ముందు పార్టీలో తెరవెనుక మంత్రాంగం నిర్వహించిన లోకేష్, టిక్కెట్ల కేటాయింపు దగ్గర నుంచి తెర ముందుకు వచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పనులు ఆయనే చక్కపెడుతున్నారు. జాతీయ స్థాయిలో పేరు, రాష్ట్రంలో తగిన గుర్తింపు తెచ్చుకునేందుకు ఎక్కడో ఓ చోట మంత్రిగా చేరటమే మంచిదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గంలో చేరాలంటే ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కావాలి. ఇప్పటికిపుడు ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు, ఎమ్మెల్యేగా శాసనసభలోకి అడుగు పెట్టాలంటే పార్టీ ఎమ్మెల్యే ఒకరితో రాజీనామా చేయించి అక్కడి నుంచి ఉప ఎన్నికల్లో గెలవాలి. మరోవైపు ఈ ఏడాది మార్చిలో రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ తరపున 2010లో గెలిచిన కేంద్రమంత్రి వైఎస్ చౌదరి, కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేష్, జేడీ శీలం, 2014లో రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన నిర్మలా సీతారామన్ పదవీ విరమణ చేయనున్నారు. ఈసారి ఏపీ నుంచి రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో టీడీపీ మూడు, వైఎస్సార్‌సీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంటాయి.

పార్టీకి వచ్చే మూడు స్థానాల్లో ఒకటి సొంత సామాజికవర్గానికి చంద్రబాబు కేటాయించే అవకాశం ఉంది. అది కూడా కుమారుడికే ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఒక సీటును లోకేష్‌కు కేటాయిస్తే ఇక సుజనా చౌదరికి అవకాశం లేనట్లే. గత కొద్ది రోజులుగా సుజనా చౌదరికి, లోకేష్‌కు పొసగటం లేదు. సుజనా చౌదరి పార్టీ నేతలు సూచించిన పనులు ఏమీ చేయకపోవటంతో పాటు తనకు తానుగా కేంద్ర మంత్రులు, ముఖ్యంగా బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరపటంతో పాటు ఢిల్లీలో అన్నీ తానే అన్నట్లు వ్యవహరించటమే వీరిద్దరి మధ్య దూరం పెరగటానికి కారణంగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో లోకేశ్ ను రాజ్యసభకు పంపి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నారు.

ఢిల్లీ స్థాయిలో లోకేష్‌కు అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతను ఆయన సన్నిహిత మిత్రుడు సీతేపల్లి అభీష్టకు అప్పగించారు. ఇటీవలనే ఆయన్ను సీఎం కార్యాలయ ఓఎస్‌డీ బాధ్యత నుంచి తప్పించిన విషయం తెలిసిందే. గతంలో పలు సర్వేలు చేయటంతో పాటు చంద్రబాబుకు అనుకూలంగా ఢిల్లీ స్థాయిలో పత్రికల్లో వార్తలు రాయించటంలో అభీష్ట కీలకపాత్ర పోషించారు. దీంతో ఆయన సేవలను అక్కడ ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఉన్న లోకేష్ ఇప్పటికే అభీష్టను ఢిల్లీ పంపినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు లోకేష్ చెప్పారు. లోకేష్ ప్రతి కదలికకు జాతీయస్థాయిలో ప్రచారం చేయించేందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడకూడదని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. ఇవన్నీ గుర్తించిన సుజనా ఇక తన టైం అయిపోయినట్లు అర్తం చేసుకుని తొలి ప్రాధాన్యంగా టీడీపీలోనే ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఇంతకాలం చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా ఉన్న సుజనా ఇప్పుడు లోకేశ్ ను చూసి భయపడుతూ పార్టీలో మునుపటి ప్రాధాన్యం పోకుండా జాగ్రత్తలు పడుతున్నారట.