Begin typing your search above and press return to search.

మాటా మాటా అనేసుకున్న సుజ‌నా.. జైట్లీ

By:  Tupaki Desk   |   9 Feb 2018 5:45 AM GMT
మాటా మాటా అనేసుకున్న సుజ‌నా.. జైట్లీ
X
అధినేత ఆదేశాలు పూర్తిస్థాయిలో ఇచ్చేయ‌టంతో తెలుగు త‌మ్ముళ్ల‌లో కొత్త ఉత్సాహం పొంగి పొర్లుతోంది. నాలుగేళ్లుగా త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయంపై నోరు విప్పాల‌ని అనుకున్న త‌మ్ముళ్ల‌కు.. బాబు వేసిన తాళంతో సాధ్యం కాని ప‌రిస్థితి.

తాజా బ‌డ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపించ‌టం.. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన ఏపీ సీఎం.. హ‌డావుడిగా నిర‌స‌న కార్య‌క్ర‌మాల్ని షురూ చేశారు. మిత్ర‌ప‌క్షంగా మౌనంగా ఉండ‌టాన్ని మోడీ అండ్ కో చేత‌కానిత‌నంగా భావిస్తుందే అని బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం ఈ మ‌ధ్య‌న క‌నిపిస్తోంది. నిర‌స‌న‌ల తీవ్ర‌త‌ను పెంచాల‌ని.. మిత్ర‌ప‌క్షంగా మోడీ స‌ర్కారుకు మంట పుట్టేలా చేయాల‌న్న ఆదేశాల్ని ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

అధినేత నోటి నుంచి వ‌చ్చిన క‌మాండ్స్ తో తెలుగు త‌మ్ముళ్లు చెల‌రేగిపోతున్నారు. ఆర్థిక‌మంత్రి జైట్లీ లాంటి ముఖ్య‌నేత ద‌గ్గ‌ర విన‌యంగా వ్య‌వ‌హ‌రించే కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సుజ‌నా చౌద‌రి తాజాగా చెల‌రేగిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. బ‌డ్జెట్ లో ఏపీకి హ్యాండ్ ఇవ్వ‌టం.. విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చే విష‌యంలో చేస్తున్న అన్యాయంపై నిర‌స‌న‌లు చేస్తున్న తెలుగు ఎంపీల‌పై జైట్లీ చిరాకు ప‌డిపోతున్నారు. తాజాగా.. గురువారం లాబీల్లో త‌న‌కు ఎదురైన సుజ‌నాను ఉద్దేశించి జైట్లీ కాస్తంత అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఏపీ విష‌యంలో తాను రెండుసార్లు ప్ర‌క‌ట‌న‌లు చేసిన త‌ర్వాత కూడా సంతృప్తి ప‌డ‌టం లేదు.. ఎందుకు నిర‌స‌న‌లు చేస్తున్నారు? అంటూ సుజ‌నాను జైట్లీ ప్ర‌శ్నించారు. దీనికి ఒళ్లు మండిపోయిన సుజ‌నా.. గ‌తానికి భిన్నంగా అస‌హ‌నంతో మాట్లాడారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల్లో ఏముంది? దాని వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వ‌చ్చేదేమీ లేదుగా అని గ‌ట్టిగా బదులిచ్చారు. అక్క‌డితో ఆగ‌ని సుజ‌నా.. "మీ ప్ర‌క‌ట‌న ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టేదిగా ఉందని చెబుతూ.. మా ముఖ్య‌మంత్రి సంతృప్తి చెంద‌లేదు. మీరు నంబ‌ర్లు కాదు మెంబ‌ర్ల‌ను గౌర‌వించాలి. మీ ప్ర‌భుత్వం శాశ్వితం కాదు. అధికారం ప‌ర్మినెంట్ కాదు. ఏపీలో ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నారు. మా నిర‌స‌న‌ను ఆపేది లేదు" అని తేల్చి చెప్పారు. రోటీన్ కు భిన్నంగా సుజ‌నా తీరు ఉండ‌టం జైట్లీకి ఇబ్బంది క‌లిగించింద‌ని.. సుజ‌నా దూకుడుకు సూటిగా బ‌దులివ్వ‌లేని ఆయ‌న‌.. స‌రే మీ ఇష్టం.. మీకు న‌చ్చిన‌ట్లు చేసుకోడంటూ వెళ్లిపోయిన‌ట్లుగా తెలిసిందే. పార్ల‌మెంటు లాబీల్లో చోటు చేసుకున్న ఈ వైనం ప‌లువురు ఆస‌క్తిగా గ‌మ‌నించిన‌ట్లుగా స‌మాచారం.