Begin typing your search above and press return to search.

రాజధానిపై జగన్ కు సుజనా రాసిన లేఖలో ఏముంది?

By:  Tupaki Desk   |   15 Jan 2020 5:36 AM GMT
రాజధానిపై జగన్ కు సుజనా రాసిన లేఖలో ఏముంది?
X
అమరావతి స్థానే.. ఏపీ రాజధానిని మూడుచోట్లకు మార్చటం కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారీ భారం పడుతుందా? అన్న సందేహం ఒకటి ఇటీవల కాలంలో తరచూ తెర మీదకు వస్తుంది. ఏపీ సర్కారు ఆలోచన ప్రకారం ఏపీ రాజధానిని మూడు చేస్తే.. అందులో ఒకటి అమరావతిలోనే ఉంటుంది. అలాంటప్పుడు రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు బదులుగా భారీగా నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న వాదనను వినిపిస్తున్నారు. అయితే.. ఆ వాదనలో పస లేదంటున్నారు.

ఎందుకంటే.. జగన్ ప్రభుత్వం ఒకవేళ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే.. అందులో అమరావతి ఒకటి అవుతుంది. కోర్ క్యాపిటల్ కాకున్నా.. రైతులు ఇచ్చిన భూముల్లో కొత్త ప్రాజెక్టులకు కేటాయిస్తే వచ్చే నష్టమేమిటి? అన్నది ప్రశ్న. మూడు రాజధానుల్లో ఒకటిగా ఉంటే అమరావతి డెవలప్ మెంట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట వినిపిస్తోంది.

దీనికి భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే.. భూములు ఇచ్చిన రైతులకు భారీ ఎత్తున నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. అమరావతికి భూమిలిచ్చిన రైతులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఎకరానికి రూ.5 నుంచి రూ.8 కోట్ల మధ్య పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెబుతన్నారు. అదే జరిగితే రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారమే రూ.1.89 లక్షల కోట్లు ఉంటుందన్నది సుజనా మాట.

రైతులకు ఇచ్చే పరిహారంతో పాటు.. అమరావతి బాండ్లు.. ఒప్పందాలు చేసుకున్న వారికి.. ఇతరులకు ఇచ్చే మొత్తాన్ని లెక్కిస్తే.. ఏకంగా రూ.2లక్షల కోట్లు దాటుతుందన్న మాటను సుజనా చెబుతున్నారు. ఇదంతా ఏపీ ప్రభుత్వం మీద భారీ భారం పడుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతటి ఆర్థిక భారాన్ని ఏపీ మోపలేదని చెబుతున్నారు. దీనికి భిన్నంగా మూడు రాజధానుల స్థానే.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించినపక్షంలో మరో రూ.3వేల కోట్లు పెడితే.. తుది దశలో ఉన్న నిర్మాణాలు పూర్తి అవుతాయంటున్నారు. తాను చెప్పిన అంశాల్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ను ఎంపీ సుజనా కోరారు. మరి.. దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.