Begin typing your search above and press return to search.

అపశకునాల సుజనా.. ముందే యేసేశాడోచ్!

By:  Tupaki Desk   |   1 Feb 2018 4:15 AM GMT
అపశకునాల సుజనా.. ముందే యేసేశాడోచ్!
X
మోడీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నది అనగానే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలు చాలా ఆశగా ఎదురుచూడడం అనేది ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డాక మామూలైపోయింది. అనాథ రాష్ట్రం కోసం నిధులు ఇవ్వడంలో ఇప్పటిదాకా ప్రతిసారీ మొండిచెయ్యిచూపించిన మోడీ సర్కారు.. ఈసారైనా ఎన్నికల సంవత్సరం గనుక ఏదైనా ప్రత్యేకశ్రద్ధ చూపిస్తుందా.. ప్రత్యేకంగా నిధుల కేటాయింపు చేస్తుందా? అనే ఆశ మాత్రం ప్రజల్లో ఉంది. అయితే తెలుగుదేశానికే చెందిన కేంద్రమంత్రి అయినప్పటికీ.. కేంద్రం చేసే వంచనలకు మద్దతుగా బ్యాటింగ్ చేస్తూ ఉండే.. కేంద్రమంత్రిగా పేరు తెచ్చుకున్న సుజనా చౌదరి మాత్రం.. బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్రానికి చెందిన ఎవ్వరూ ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా ముందే బ్రేకులు వేసేస్తున్నారు.

కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో కేటాయింపులు అనేవి రంగాల వారీగా ఉంటాయి తప్పితే.. రాష్ట్రాల వారీగా ఉండవు అనే విషయాన్ని సుజనా చౌదరి కొత్తగా దేశ ప్రజలకు తెలియజెబుతున్నారు. ఈ సంగతి తానే కనుగొన్నట్లుగా ఆయన అనుకుంటున్నారో.. లేదా, దేశ ప్రజలెవ్వరికీ తెలియని సంగతి అని భావిస్తున్నారో తెలియదు గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన పుణ్యమాని కేంద్రం కేటాయించవలసిన నిధులు అనేవి ఏ ‘రంగం’ కిందికి వస్తాయో కూడా ఆయన విపులీకరిస్తే బాగుంటుందని పలువురు దెప్పి పొడుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం అందించే వ్యవహారంలో కేంద్రం రకరకాల డ్రామాలు ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలే ప్రత్యేకహోదా విషయంలో చేసిన వంచననే ప్రజలు ఇంకా మరచిపోలేకపోతున్నారు. దాని స్థానంలో ప్యాకేజీ అని ప్రకటించి.. ఆ పద్దు కింద కూడా ఇప్పటిదాకా కేంద్రం ఏమీ విదిల్చకపోవడాన్ని ప్రజలు గర్హిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ గనుక.. ఏపీ ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే.. భాజపా ఈ బడ్జెట్ లో ఏపీ సంక్షేమం - రాజధాని - పోలవరం కోసం భారీగా నిధులు కేటాయిస్తుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. కానీ.. రాష్ట్రాల వారీగా కేటాయింపులు బడ్జెట్ లో ఉండవంటూ.. కేంద్రం మీద ఎవ్వరికీ కోపం రాకుండా ఉండాలన్నట్లుగా సుజనా చౌదరి ముందే స్టేట్ మెంట్లు ఇచ్చేసి ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేయడం చిత్రంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.