Begin typing your search above and press return to search.

సుజ‌నా మాట‌!..బాబు ధ‌ర్మ‌ పోరాటం అధ‌ర్మ‌మే!

By:  Tupaki Desk   |   14 July 2019 5:31 PM GMT
సుజ‌నా మాట‌!..బాబు ధ‌ర్మ‌ పోరాటం అధ‌ర్మ‌మే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... ఏపీ సీఎం హోదాలో చేసిన ధ‌ర్మపోరాట దీక్ష‌ల‌ను ఆ పార్టీ ద్వారా రాజ్య‌స‌భ స‌భ్యత్వం పొంది ఇప్పుడు బీజేపీలో చేరిపోయిన కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి అధ‌ర్మ పోరాట దీక్ష‌లుగా అభివ‌ర్ణించారు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన త‌ర్వాత నేరుగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించేందుకు అంత‌గా ఆస‌క్తి చూప‌ని సుజ‌నా... ఇప్పుడు ఫ‌క్తు బీజేపీ నేత‌లానే మారిపోయారు. చంద్ర‌బాబు తీరును దునుమాడుతూ... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన త‌ర్వాత తొలిసారి ఏపీకి వ‌చ్చిన సంద‌ర్భంగా అమ‌రావ‌తి ప‌రిధిలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఆత్మ‌య స‌భ‌లో సుజ‌నా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుజ‌నా... చంద్ర‌బాబును నేరుగా టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం హోదాలో చంద్ర‌బాబు చేసిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు ముమ్మాటికీ అధ‌ర్మ పోరాట దీక్ష‌లేన‌ని ఈ సంద‌ర్భంగా సుజ‌నా కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు చంద్ర‌బాబు స‌మాయ‌త్త‌మ‌వుతున్న స‌మ‌యంలో తాను ఈ దీక్ష‌లు వ‌ద్ద‌ని వారించాన‌ని కూడా సుజ‌నా చెప్పారు. అయితే త‌న చుట్టూ చేరిన కొంద‌రి మాట‌ల‌కే ప్రాధాన్యం ఇచ్చిన చంద్ర‌బాబు... త‌న మాట‌ను మాత్రం పట్టించుకోలేద‌ని సుజ‌నా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే పార్టీ అధినేత నిర్దేశించిన వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం మిన‌హా త‌న‌కు గ‌త్యంత‌రం లేక‌పోయింద‌ని, అందుకే తాను దీక్ష‌ల‌ను నాడు వ్య‌తిరేకించ‌లేక‌పోయాన‌ని, బ‌హిరంగంగానూ ఆ దీక్ష‌ల‌పై మాట్లాడ‌లేక‌పోయాన‌ని సుజ‌నా చెప్పారు. మొత్తంగా నాడు చంద్ర‌బాబు చేసిన ధ‌ర్మ పోరాట దీక్ష‌లు ముమ్మాటికీ అధ‌ర్మ పోరాట దీక్ష‌లేన‌ని సుజ‌నా త‌న‌దైన శైలి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇక 2014కు ముందు బీజేపీతో టీడీపీకి మైత్రి కుద‌ర్చ‌డంలో తానే కీల‌క భూమిక పోషించాన‌ని సుజ‌నా చెప్పుకొచ్చారు. ఇక ఇన్నాళ్లు టీడీపీలో ఉండి ఇప్పుడు బీజేపీలో చేర‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా సుజ‌నా వివ‌రించే య‌త్నం చేశారు. ఇప్ప‌టిదాకా తాను ప‌రోక్ష రాజ‌కీయాల్లో మాత్ర‌మే ఉన్నాన‌ని, అయితే ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టాల‌న్న ఉద్దేశ్యంతోనే తాను బీజేపీలో చేరాన‌ని సుజ‌నా చెప్పారు. ఇందుకోసం బీజేపీనే ఎందుకు ఎంచుకున్నాన‌న్న విషయంపైనా క్లారిటీ ఇచ్చిన సుజ‌నా... ప్ర‌పంచంలో ఏ ఒక్క దేశం వ‌ద్ద కూడా భారత్ ను మోక‌రిల్లే అవకాశం లేకుండా మోదీ అద్భుత‌మైన పాల‌న అందిస్తున్నార‌ని, అందుకే తాను బీజేపీలో చేరాన‌ని సుజ‌నా చెప్పారు. ఇప్ప‌టిదాకా దేశానికి ప్ర‌ధానులుగా వ్య‌వహ‌రించిన వారంతా ఏదో ఒక సంద‌ర్భంలో ఏదో ఒక దేశం ముందు దేహీ అంటూ నిల‌బ‌డ్డ వారే త‌ప్పించి... మోదీలా భార‌త్ గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి చాటిన నేత లేర‌ని కూడా సుజ‌నా చెప్పారు. ఏపీ అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్న బీజేపీ... త‌ప్ప‌నిస‌రిగా ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు పెట్టిస్తుంద‌న్న ఆశాభావం త‌న‌కుంద‌ని సుజ‌నా చెప్పారు. మొత్తానికి బీజేపీలో చేర‌గానే... చంద్ర‌బాబును దునుమాడ‌టం, మోదీని కీర్తించ‌డాన్ని సుజ‌నా చాలా త్వ‌ర‌గానే నేర్చుకున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.