Begin typing your search above and press return to search.

నైతికత డైలాగులు వల్లిస్తున్న ఫిరాయింపు మంత్రి!

By:  Tupaki Desk   |   19 July 2017 4:53 PM GMT
నైతికత డైలాగులు వల్లిస్తున్న ఫిరాయింపు మంత్రి!
X
‘నైతికత’ అంటే ఏమిటి? తెలుగు డిక్షనరీల్లో వెతుక్కుంటే తప్ప.. సరైన అర్థం బోధపడేలా లేదిప్పుడు! లేదా, మన మంత్రిగారు చెప్పిన ప్రకారం అర్థం చేసుకుంటే.. నైతికత అనే పదానికి రకరకాల భిన్నమైన అర్థాలు మనకు స్ఫురిస్తాయి. తనను గెలిపించిన, రాజకీయ అవకాశం ఇచ్చిన పార్టీని అర్థంతరంగా వదిలేసి, అధికారం మీద ఆశతో ఫిరాయించడం, రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుంటే తాను చేసింది తప్పుగా తేలుతుందని తెలిసినప్పటికీ... దబాయించి నెగ్గుకు రావాలని చూడడం... ఇలాంటి చర్యలన్నీ నైతికత కిందికే వస్తాయేమో అని అనుమానం కలుగుతుంది. అవును మరి.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచి, ప్రస్తుతం చంద్రబాబునాయుడు కేబినెట్ లో మంత్రిగా ఉన్న సుజయకృష్ణ రంగారావు - ఫిరాయింపులపై వివరణకు హైకోర్టు నోటీసులు పంపిన నేపథ్యంలో... తన నైతిక విలువల గురించి డాంబికంగా చెప్పుకుంటున్నారు.

ఇంతకూ ఆయన ఏం చెప్పారో తెలుసా? ’’తాను నైతికతను పాటించే వ్యక్తినని పార్టీ మారడానికి ముందు.. వైఎస్ జగన్ ఇంటికి వెళ్లి పార్టీకి రాజీనామా లేఖ ఇస్తే దానిని ఆమోదించలేదని... చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత కావాలనే దానిని రాద్ధాంతం చేస్తున్నారని’’ అంటున్నారు. వైసీపీ తరఫున గెలిచినా, తెదేపా సర్కారులో మంత్రిగా ఉండడం అనే పరిణామాన్ని నైతికత - సాంకేతిక కోణాల్లోంచి చూడాల్సిన అవసరం ఉన్నదని సుజయకృష్ణ సెలవిస్తున్నారు.

సాంకేతిక కోణాల సాకు చూపించి.. ఫిరాయింపు మంత్రులు చెలరేగిపోతే పోవచ్చు గాక.. కానీ ఆయనగారు నైతికత అనే పదాన్ని ఏ భావంలో ఇక్కడ ప్రయోగించారన్నదే చాలా సస్పెన్స్ గా ఉంది. తనలోని నైతికత గురించి ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ చెబుతానని కూడా ఆయన తెగేసి అంటున్నారు.

అయినా.. సాధారణ జనసామాన్యానికి తెలిసినంత వరకూ... నైతికత అంటే.. నీతి- నిబద్ధతలను వీడకుండా.. కొన్ని విలువలకు కట్టుబడి జీవనం సాగించడం. మరి ఒక పార్టీ ద్వారా తనకు సంక్రమించిన పదవికి రాజీనామా చేయకుండా, ఆ పార్టీని మాత్రం ఒగ్గేసి.. పదవికోసం అర్రులు చాస్తూ అధికారపక్షం పంచన చేరడం ఏ రకమైన నైతికత అనిపించుకుంటుందో మంత్రిగారికే తెలియాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.