Begin typing your search above and press return to search.

ద‌క్షిణాది సెంటిమెంట్ ను ట‌చ్ చేసిన‌ సుమ‌న్!

By:  Tupaki Desk   |   5 March 2018 9:54 AM GMT
ద‌క్షిణాది సెంటిమెంట్ ను ట‌చ్ చేసిన‌ సుమ‌న్!
X
ప్ర‌స్తుతం భార‌త దేశంలో మూడో ఫ్రంట్ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, కాంగ్రెస్ - బీజేపీల పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ కు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ - అస‌దుద్దీన్ ఒవైసీ ల‌తో పాటు పలువురు మ‌ద్దతు తెలుపుతున్నారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కూడా కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఆయ‌న వెంట న‌డుస్తాన‌ని ప్ర‌క‌టించారు. తాజాగా, సినీ న‌టుడు సుమ‌న్ ...కేసీఆర్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ‌లో రైతుల‌కు ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేసింద‌ని, కేసీఆర్..... రైతులకు 24 గంటలు విద్యుత్తు అందిస్తూ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నారని సుమన్ కితాబిచ్చారు.

రైతులకు హెల్త్ కార్డులు జారీ చేయాల‌న్న కేసీఆర్ ఆలోచ‌న అద్భుతంగా ఉంద‌న్నారు. దక్షిణాదికి చెందిన నేతకు ఉప ప్రధాని పదవి ఇవ్వాలని ఆయ‌న అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన మోదీ ప్రధాన మంత్రిగా ఉన్నార‌ని, అందువ‌ల్ల దక్షిణాది వారికి మంత్రి వర్గంలో ప్రాధాన్య‌తనివ్వాల‌న్నారు. తెలుగు తోపాటు కేరళ, కన్నడ సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నాన‌ని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నాన‌ని సుమన్ తెలిపారు. మహిళలు - విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యం కలిగించేందుకు క‌రాటే పోటీలు నిర్వహిస్తున్నామ‌న్నారు. తెలంగాణ‌లోని కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో కరాటే విద్యను ప్రవేశపెట్టాలని కోరారు. తమిళ‌నాడు తరహాలో తెలంగాణ‌లో కూడా అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు.