Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఓకే అంటే పార్టీలోకి వ‌స్తా: సుమన్

By:  Tupaki Desk   |   24 March 2018 8:33 AM GMT
కేసీఆర్ ఓకే అంటే పార్టీలోకి వ‌స్తా: సుమన్
X
అవ‌స‌రం ఎవ‌రిది? అన్న‌దే రాజ‌కీయాల్లో కీల‌కంగా మారుతుంది. ఆస‌క్తి.. అవ‌స‌రం ఉంటే త‌ప్పించి రాజ‌కీయాల్లో అవ‌కాశాలు వెతుక్కుంటూ రావు. త‌మ‌కు అవ‌స‌రం అనుకుంటే నిద్ర‌పోతున్నోడిని కూడా లేపి టికెట్ ఇచ్చిన ఉదంతాలు తెలుగు రాజ‌కీయాల్లో చాలా క‌నిపిస్తాయి. అదే స‌మ‌యంలో.. ఎంత తిరిగినా.. బ‌తిమిలాడినా.. వేడుకున్నా అవకాశాలు రాని నేత‌లు ఎంద‌రో క‌నిపిస్తారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎవ‌రికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అవ‌స‌రం ఉండేద‌మో కానీ ఆయ‌నకు ఎవ‌రి అవ‌స‌రం లేదని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌జామోదంతో పాటు.. ప‌రిస్థితుల్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. అలాంటి వేళ ఒక ప్ర‌ముఖ న‌టుడు కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

తన‌కు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌న్న ఆస‌క్తి ఉన్న‌ప్ప‌టికీ.. కేసీఆర్ పిలిస్తే వ‌స్తానంటూ కండీష‌న్ పెట్ట‌టం విశేషం. నిన్న‌టిత‌రం హీరో.. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ గా మారిన సుమ‌న్ తాజాగా త‌న రాజ‌కీయ అభిలాష గురించి నోరు విప్పారు. తాను రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్నాన‌ని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే తాను టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ ప‌లువురు సినీ న‌టుల క‌న్ను రాజ‌కీయాల్లో ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో ఇప్పుడు సినీ న‌టులు రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌నే ప‌లువురు సినీ న‌టులు 2019 ల‌క్ష్యంగా రాజ‌కీయాల మీద దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి వేళ‌.. సుమ‌న్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌కు టీఆర్ఎస్ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి. అయినా.. పార్టీలో చేరాల‌న్న ఆస‌క్తి.. అవ‌స‌రం ఎవ‌రిదంటారు? అలాంట‌ప్పుడు.. కేసీఆర్ పిలిస్తే పార్టీలో చేర‌తాన‌న్న మాట‌లేమిటో?