Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి అప్పుడే అంత సీను లేదట‌ - హీరో

By:  Tupaki Desk   |   22 Aug 2016 6:03 AM GMT
అమ‌రావ‌తికి అప్పుడే అంత సీను లేదట‌ -  హీరో
X
ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మిస్తాన‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు బీరాలు ప‌లుకుతున్న స‌మ‌యంలో తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తికి అప్పుడే అంత సీను లేద‌న్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా సినీప‌రిశ్ర‌మ స‌మీప‌ భ‌విష్య‌త్తులో అమ‌రావ‌తికి త‌ర‌లివెళ్లే ప‌రిస్థితులు లేవ‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశారు. వివాదాల‌కు దూరంగా ఉండే సుమ‌న్ ముక్కుసూటిగా మాట్లాడుతార‌ని... స్ప‌ష్టమైన అభిప్రాయాలు వ్య‌క్తంచేస్తార‌ని పేరు. దీంతో సుమ‌న్ వ్యాఖ్య‌ల‌కు సినీ రంగం నుంచి కూడా లోలోన మ‌ద్ద‌తు క‌నిపిస్తుంది.

చిత్ర పరిశ్రమ అమరావతికి తరలివెళ్లే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదని సుమ‌న్ తేల్చేశారు. అందుకు కారణం కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఒకప్పుడు చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ తరలి వచ్చినప్పుడు హైదరాబాద్‌ లో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవని.. స్డూడియో కట్టుకోవడానికి, ఇతర అవసరాలకు భూమి సులువుగా దొరికేదని.. ప్రస్తుతం అమరావతిలో ధరలు చూస్తుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆయ‌న విశ్లేషించారు. అమరావతి - విజయవాడలో భూముల ధరలు భారీగా ఉన్నందున చిత్రపరిశ్రమలు తరలివెళ్లడం కష్టమని సుమ‌న్ స్ప‌ష్టం చేశారు.

పైగా రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్‌ లో కొత్తగా స్డూడియోలు వస్తున్నందున తెలుగు చిత్రపరిశ్రమకు హైదరాబాదే కేంద్రంగా ఉండొచ్చ‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. కర్ణాటకలోని కోలార్‌ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుమ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వాన్ని తాకిన‌ట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు సినీరంగం న‌వ్యాంధ్ర‌కు రావాల‌ని సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో పిలుపునిచ్చినా ఆ దిశ‌గా చ‌ర్య‌లు క‌నిపించ‌ని త‌రుణంలో సుమ‌న్ వ్యాఖ్య‌ల్లోని నిజాలు ప్ర‌భుత్వం అర్థం చేసుకోవాల‌ని సినీరంగానికి చెందిన‌వారు అంటున్నారు. ప‌రిశ్ర‌మ అక్క‌డికి త‌ర‌లాలంటే ప్ర‌భుత్వం నుంచి ప్రోత్సాహం ఉండాల‌న్న వాద‌న వినిపిస్తోంది. న‌వ్యాంధ్ర‌లో భూముల ధ‌ర‌లు చుక్క‌ల‌నంటుతున్న త‌రుణంలో అక్క‌డికి త‌ర‌లాలంటే ప్రభుత్వం అండ‌దండ‌లు ఉండాల్సిందేన‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. కాగా చంద్ర‌బాబు, తెలుగుదేశం ప్ర‌భుత్వంతో మంచి సంబంధాలే ఉన్న సుమ‌న్ వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు సూచ‌న‌గానే తీసుకుని కీల‌క అడుగు వేస్తే బాగుంటుంద‌న్న ఆకాంక్ష సినీరంగం నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.