Begin typing your search above and press return to search.

సర్వే చెప్పిన సారాంశం : వైసీపీ బలం కాదది.. విపక్షం వీక్...

By:  Tupaki Desk   |   19 Aug 2022 8:30 AM GMT
సర్వే చెప్పిన సారాంశం : వైసీపీ బలం కాదది.. విపక్షం వీక్...
X
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వైసీపీ అధికారంలోకి వస్తుందని అనేక జాతీయ ఏజెన్సీలు సర్వే చేశాయి. నెల తేడాలో అలా వచ్చిన మూడు సర్వేలు వైసీపీ జెండావే 2024లో ఎగురుతుందని కూడా గట్టిగా చాటాయి. దాంతో ఏపీలో వైసీపీకి ఇంతటి ఆదరణ ఎలా లభిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా మళ్ళీ వైసీపీ పవర్ లోకి రావడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే ఇలాంటి సర్వేలను నమ్మలేమని కూడా పెదవి విరిచారు. అయితే ఎవరు ఏమనుకున్న ఈ సర్వే అన్నది వాస్తవం. అది క్షేత్ర స్థాయి పరిస్థితులను ప్రతిబింబించింది.

ఇదిలా ఉంటే ఈ సర్వేలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపించింది అని సర్వే వెనక అసలు సారాంశం చెబుతోంది. జాతీయ స్థాయిలో ఈ తరహా సర్వేలు చేయడంలో అపారమైన అనుభవం ఉన్న పీ మారో సర్వే కమిటీలోని మెంబర్ ఒకరు ఏపీలో ఉన్న పరిస్థితులను సర్వే డేటాలోని అసలు విషయాలను చెప్పారు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని అద్దం పట్టేదే అని కూడా చెప్పారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో వైసీపీకి వ్యతిరేకత బలంగానే ఉందని చెప్పుకొచ్చారు.

కానీ ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే చాతుర్యం, నైపుణ్యం, తీరిక ఓపిక విపక్షాలకు లేకపోవడం వల్లనే ఏపీలో వైసీపీ బలంగా కనిపిస్తోంది అని అసలు విషయం చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సక్రమంగా తన విపక్ష పాత్రను పోషించడంలేదు అన్నదే సర్వే చెబుతున్న అసలు విషయంగా ఉంది. టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు రోడ్లపైకి రాకుండా ఇళ్లకే పరిమితమై ప్రజలలో ఆదరణ పొందాలని చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయనే ఈ సర్వే చెప్పిన అసలు సత్యమని కూడా పేర్కొంటున్నారు.

ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఏపీలో బలమైన విపక్షం లేదని ఈ సర్వేలు తేల్చాయని అంటున్నారు. అంటే టీడీపీ తాను వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకతతో గెలుస్తాను అనుకుంటోంది తప్ప తానుగా జనంలోకి పోయి విశ్వాసాన్ని పొందే ప్రయత్నం అయితే మూడేళ్ళుగా చేయలేదని సర్వేలు అన్నీ కుండబద్ధలు కొట్టాయని అంటున్నారు. ఒక విధంగా విపక్షాలు చేతులెత్తేయడమే వైసీపీ విజయంగా కూడా సర్వేల నుంచి తెలుసుకోవలసిన విషయం అంటున్నారు.

అంటే ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. గెలిచేస్తుంది అన్నది పక్కన పెడితే విపక్షాలే ఆ పార్టీని గెలిపిస్తున్నాయి అనుకోవలసి ఉంటుందేమో. ఇక ఇక్కడ మరో మంచి మాట కూడా ఆ సర్వే మెంబర్ చెప్పి ఏపీలో విపక్షాలకు ఊరటను ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేంటి అంటే ఇంకా రెండేళ్ళ వరకూ ఏపీలో ఎన్నికలు లేవు. ఇప్పటికి ఉన్న పరిస్థితి ఇది. 2017లో కూడా టీడీపీ మూడేళ్ళ పాలన తరువాత బలంగానే కనిపించింది. నాడు జగన్ కూడా పాదయాత్రలు లాంటివి చేపట్టలేదు. ఆ తరువాత పూర్తిగా మార్పు వచ్చింది.

ఇపుడు కూడా అలా చూసుకుంటే కనుక విపక్షాల చేతిలో ఇంకా అవకాశాలు ఉన్నాయనే ఈ సర్వేల అసలు సారాంశం అనుకోవాలి. విపక్షాలు ఈ రోజు నుంచి అయినా జనాలలో ఉంటూ గట్టిగా పోరాడితే మాత్రం కచ్చితంగా వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అదే టైం లో విపక్షాలు కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయనే అనుకోవాలి. మరి జాతీయ సర్వేలను చూసి వైసీపీ పొంగిపోవడానికి ఏమీ లేదు, విపక్షాలు కృంగిపోవడానికీ ఏమీ లేదనే అసలు సారాంశం అన్న మాట. సో విపక్షాలు ఫీల్డ్ లోకి దూకాల్సిన సమయం ఆసన్నం అయింది అనే భావించాలి. మరి ఇపుడు కూడా కాడె వదిలేస్తే సర్వేలు చెప్పినే నిజమయ్యే ప్రమాదం ఉంది.