Begin typing your search above and press return to search.

మహానగరానికి చినుకు చిక్కులు

By:  Tupaki Desk   |   14 April 2015 7:54 AM GMT
మహానగరానికి చినుకు చిక్కులు
X
ప్రభుత్వాలు మారతాయి.. ముఖ్యమంత్రులు మారతారు. కానీ.. సమస్య మాత్రం యథాతధంగా ఉంటాయి. చినుకు పడితే చిత్తడిగా మారే మహానగరంగా హైదరాబాద్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఏ పాటివో మరోసారి రుజువైంది. ఉమ్మడిరాష్ట్రంలో ఇలాంటి సమస్య ఎదురైతే సీమాంధ్రుల పాలనలో హైదరాబాద్‌ను నాశనం చేశారని.. తమకు కానీ అధికార పగ్గాలు చేతికి వస్తే సమూలంగా మార్చేస్తామంటూ చాలానే మాటలు వినిపించేవారు టీఆర్‌ఎస్‌ నేతలు.

వారు కోరుకున్నట్లే టీఆర్‌ఎస్‌ తెలంగాణ అధికారపక్షంగా అవతరించింది. తిరుగులేని బలంతో దూసుకెళుతోంది. అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవు. బంగారు తెలంగాణ అంటూ అధికారపక్ష నేతలు తరచూ వ్యాఖ్యలు చేస్తున్నా.. మాటల్లో కనిపించే బంగారం చేతల్లో మాత్రం కనిపించని పరిస్థితి.

ఉమ్మడిరాష్ట్రంలో చినుకు పడితే చిత్తడిగా మారే హైదరాబాద్‌ .. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. డ్రైయినేజీల్లోని లోపాల్ని సరిదిద్దటం.. మురుగునీరు పోయేలా చర్యలు తీసుకోవటం.. రోడ్ల మీద నీరు నిలవకుండా.. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పిన మాటలన్నీ నీళ్ల మూటలేనని మరోసారి తేలిపోయింది.

ఆకాల వర్షాలతో తెలంగాణ.. ఆంధ్రా రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి. మరోవైపు వర్షాల కారణంగా భాగ్యనగరంలో బతుకీడ్చే సాదాసీదా జనాలకు సినిమా కష్టాలన్నీ మీద పడ్డాయి. రోడ్ల మీద పెద్దఎత్తున వాననీరు నిలిచిపోవటం.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావటం.. ఇళ్లల్లోకి మురుగునీరు అడుగు మేర నిలిచిపోవటం లాంటి కష్టాలతో నగరజీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

దీనికితోడు సోమవారం అర్థరాత్రి కురిసిన వడగళ్ల వానతో కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. దాదాపు అర కిలో బరువు ఉన్న వడగళ్లు నగరంలో అక్కడక్కడ పడ్డాయి. విపరీతమైన ఈదురుగాలులతో కుకట్‌పల్లి.. మాదాపూర్‌ ప్రాంతాల్లో పలు చెట్లు కూలిపోయాయి. పెద్దఎత్తున వాహనాలు దెబ్బ తిన్న పరిస్థితి. దీనికి తగ్గట్లే ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు.. ఈదురుగాలుల పుణ్యమా అని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఆకాల వర్షం నగరాన్ని స్తంభింపచేసింది. ప్రభుత్వాలు ఏవి ఉన్నా సామాన్యుడి బతుకుకష్టం మారదన్న విషయం మరోసారి తేలిపోయింది.