Begin typing your search above and press return to search.

తొలకరి వేళ నిప్పులు కురిపిస్తున్న భానుడు

By:  Tupaki Desk   |   30 May 2018 9:41 AM GMT
తొలకరి వేళ నిప్పులు కురిపిస్తున్న భానుడు
X
లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్నట్టు చివర్లో సూరీడు రెచ్చిపోతున్నాడు. తెలుగు రాష్ట్రాలపై తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేయించాడు. దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అవి తెలుగు రాష్ట్రాలను తాకడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ చివరి రోజుల్లో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణ పవనాలే కారణమని భారత వాతావరణ విభాగం తెలిపింది.

చత్తీస్ ఘడ్ మీదుగా మహారాష్ట్రలోని విదర్భ - తెలంగాణ - కోస్తా జిల్లాలకు ఉష్ణగాలులు వీస్తున్నందున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని నెల్లూరులో బుధవారం గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ - అమరావతి - ఒంగోలు - కర్నూలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు - ఏలూరు - తిరుపతిలో 43 - కడపలో 42 - రాజమండ్రి - విజయనగరంలో 41డిగ్రీలు - శ్రీకాకుళం - అనంతపురంలో 40 - విశాఖలో 38 - కాకినాడలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటలపాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది.

ఇక దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అత్యధికంగా రాజస్థాన్ - గుజరాత్ రాష్ట్రాల్లో 47 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.