Begin typing your search above and press return to search.

`సునంద` కేసు చార్జి షీటులో శశి థ‌రూర్!

By:  Tupaki Desk   |   14 May 2018 12:37 PM GMT
`సునంద` కేసు చార్జి షీటులో శశి థ‌రూర్!
X
కాంగ్రెస్ ఎంపీ శిశథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి నాలుగేళ్ల క్రితం దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన సంగ‌తి తెలిసిందే. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్ గదిలో సునంద మృతి ప‌లు అనుమానాలు రేకెత్తించింది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఉప‌యోగించే అల్ప్రాక్స్ మత్తు ట్యాబ్లెట్లు ఆమె శరీరంలో మోతాదుకు మించి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే, సునంద కావాల‌నే వాటిని తీసుకొని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిందా...లేక ఎవ‌రన్నా ఆమెకు బ‌ల‌వంతంగా వాటిని ఇచ్చారా అన్న అన్న సందేహాలు వ్య‌క్తమ‌య్యాయి. అయితే, ఈ ఘ‌ట‌న‌కు కొద్ది రోజుల ముందు పాకిస్థాన్ జర్నలిస్టుతో శ‌శి ధ‌రూర్ కు సంబంధాలున్నాయ‌ని సునంద స్వ‌యంగా ఆరోపించింది. దీంతో, సునంద మృతి వెనుక శ‌శి థ‌రూర్ పాత్ర ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే, 2015లో ఆ ఘ‌ట‌న‌ను హత్య కేసుగా న‌మోదు చేసిన పోలీసులు అందులో అనుమానితుల పేర్లు తెలుప‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆ కేసు చార్జిషీటులో శ‌శి థ‌రూర్ పేరును ఢిల్లీ పోలీసులు చేర్చ‌డం క‌ల‌క‌లం రేపింది. సునంద మృతి కేసు చార్జి షీటును ఢిల్లీలోని పటియాలా కోర్టులో పోలీసులు సోమ‌వారం దాఖ‌లు చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శిశథరూర్ కు ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. ఆయ‌న పేరును సునంద మృతి కేసు చార్జిషీటులో చేర్చారు. సునంద ఆత్మహత్యకు శ‌శి థ‌రూర్ ప్రేరేపించినట్టు ఆ ఛార్జిషీటులో పేర్కొన్నారు. ఈ ప్ర‌కారం పటియాలా కోర్టులో ఛార్జిషీటును సోమ‌వారం నాడు దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 498 ఎ (భర్త, ఆయన త‌ర‌ఫు బంధువులు కానీ మహిళ పట్ల క్రూరంగా వ్యవహరించడం), సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద శ‌శి థ‌రూర్ పై ఛార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను మే 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.ఈ నేప‌థ్యంలో ఆ చార్జిషీటుపై బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్ర‌మ‌ణ్య స్వామి స్పందించారు. సీఆర్పీసీ 301 ప్ర‌కారం తాను ప్రాసిక్యూట‌ర్ కు సాయం చేయ‌వ‌చ్చ‌ని, మే24న జ‌ర‌గ‌బోతోన్న‌విచార‌ణ‌కు తాను హాజ‌ర‌వుతాన‌ని ట్వీట్ చేశారు.

త‌న పేరు చార్జి షీటులో చేర్చ‌డాన్ని శ‌శి థ‌రూర్ ఖండించారు. నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ కేసు చార్జిషీటులో త‌న పేరు చేర్చ‌డం ఢిల్లీ పోలీసుల విచార‌ణ తీరుకు అద్దంప‌డుతోంద‌ని ట్వీట్చేశారు. ఈ చార్జిషీటుపై తాను అప్పీల్ చేస్తాన‌ని చెప్పారు. గ‌త ఏడాది అక్టోబ‌రులో ఈ కేసుకు సంబంధించి ఎవ‌రికీ వ్య‌తిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవ‌ని కోర్టులో లా ఆఫీస‌ర్ చెప్పార‌ని అన్నారు. ఆరు నెల‌లు తిర‌గ‌క ముందే తాను సునంద‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాన‌ని చెప్ప‌డం న‌మ్మ‌శ‌క్యంగా లేద‌న్నారు. మ‌రోవైపు, ఆ చార్జిషీటులో శశి థ‌రూర్ పేరు చేర్చ‌డాన్ని కాంగ్రెస్ ఖండించింది. తాము శ‌శి థ‌రూర్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని ట్వీట్ చేసింది. రాజ‌కీయ కుట్ర‌లో భాగంగానే శ‌శి థ‌రూర్ పేరును చార్జిషీటులో చేర్చార‌ని మండిప‌డింది. మ‌రోవైపు, ఎంపీ హోదాలో ఉన్న శ‌శి థ‌రూర్ పేరు చార్జిషీటులో చేర్చ‌డంతో ఈ వ్య‌వ‌హారాన్ని స్పెష‌ల్ సీబీఐ జ‌డ్జి అర‌వింద కుమార్ కు బ‌దిలీ చేశారు.