Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ‌కు రామోజీ వియ్యంకుడు

By:  Tupaki Desk   |   11 Dec 2015 2:59 PM GMT
రాజ్య‌స‌భ‌కు రామోజీ వియ్యంకుడు
X
వ‌చ్చే ఏడాది జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఏపీలో అధికార టీడీపీకి పెద్ద స‌వాల్ కానున్నాయి. ప్ర‌స్తుతం అసెంబ్లీలో టీడీపీకి ఉన్న బ‌లం దృష్ట్యా ఆ పార్టీ సులువుగానే మూడు స్థానాలు గెలుచుకుంటుంది. ఈ మూడు స్థానాల్లో గెల‌వ‌డం టీడీపీకి ఇబ్బంది కాక‌పోయ‌నా అభ్య‌ర్థుల ఎంపిక మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద స‌వాల్‌ గా మార‌నుంది. టీడీపీ దక్కించుకోబోయే మూడు సీట్లకు కూడా పోటీ ఓ రేంజ్‌ లో ఉంది. వీటిలో ఒకటి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మరోకటి సిట్టింగ్ ఎంపీ - కేంద్ర మంత్రి సుజనాచౌదరికి దక్కడం ఖాయం. సుజ‌నాచౌద‌రికి బెర్తు గ్యారెంటీ అయినా బీజేపీకి ఇచ్చే సీటు విష‌యంలో నిర్మల‌కు వెంక‌య్య‌నాయుడి నుంచి కూడా గ‌ట్టి పోటీ ఉంది.

ఇక మూడో సీటు విష‌యానికి వ‌స్తే ఈ సీటు కోసం ప‌లువురు పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ త‌న‌యుడు హ‌రికృష్ణ ఈ సీటు ఆశిస్తుండ‌గా...చంద్రబాబు మాత్రం ఆయ‌న ప్ర‌తిపాద‌న‌ను అస్స‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో ఉన్న‌ట్టు లేరు. ఇక చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న కుమారుడు లోకేష్‌ ను జాతీయ రాజ‌కీయాల్లో పాపుల‌ర్ చేసే ఉద్దేశంతో ఉన్నందున లోకేష్ పేరు కూడా లైన్లోకి వ‌స్తోంది. అలాగే బీసీ కోటాలో ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు రాజ్య‌స‌భ ఆశిస్తున్నారు.

ఈ పేర్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే ఇప్పుడు ఇదే సీటు కోసం మ‌రో కొత్త వ్య‌క్తి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన సుందరనాయుడు రాజ్య‌స‌భ సీటు ఆశిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పేరు టీడీపీ నాయ‌కుల‌కే పెద్ద‌గా తెలియ‌దు. ఇంత‌కు సుంద‌ర‌నాయుడు ఎవ‌ర‌నుకుంటున్నారా...ఈనాడు అధినేత రామోజీరావుకు స్వ‌య‌నా వియ్యంకుడు. రాష్ట్ర కోళ్ల పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడైన సుందరనాయుడు స్వయానా రామోజీరావు పెద్ద కోడలు, మార్గ‌ద‌ర్శి ఎండీ శైలాజా కిర‌ణ్‌ కు తండ్రి. ఈయ‌న ఇటీవ‌ల చిత్తూరు జిల్లా టీడీపీ కార్య‌క్ర‌మాల్లో త‌ర‌చుగా పాల్గొంటున్నారు. దీంతో సుంద‌ర‌నాయుడు టీడీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ సీటు ఆశిస్తున్నార‌ని...ఆయ‌న‌కు రామోజీ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయ‌న్న ప్ర‌చారం ఏపీ టీడీపీ పొలిటిక‌ల్ కారిడాలో జోరుగా సాగుతోంది. రామోజీ త‌ల‌చ‌కుంటే సుంద‌ర‌నాయుడుకు రాజ్య‌స‌భ సీటు గ్యారెంటీయే అయినా అనేక సామాజిక స‌మీక‌ర‌ణాలు...ర‌క‌ర‌కాల ఈక్వేష‌న్ల‌లో చంద్ర‌బాబు ఉన్నారు. ఫైన‌ల్‌ గా టీడీపీలో మూడో రాజ్య‌స‌భ సీటు ఎవ‌రికి దక్కుతుందో పెద్ద స‌స్పెన్స్‌ గా మారింది.