Begin typing your search above and press return to search.

డౌట్లు తీరేలా సుందర్ పిచాయ్ క్లారిటీ

By:  Tupaki Desk   |   9 May 2022 10:55 AM GMT
డౌట్లు తీరేలా సుందర్ పిచాయ్ క్లారిటీ
X
పరిచయం చేయాల్సిన అవసరం లేని గ్లోబల్ ప్రముఖుడు సుందర్ పిచాయ్. తమిళనాడుకు చెందిన ఈ గూగుల్ బాస్ కు సంబంధించిన అందుబాటులో ఉన్న సమాచారంలో బోలెడన్ని తప్పులు ఉన్నట్లు చెబుతారు. చెన్నైలోని సాదాసీదా స్కూల్లో చదువుకొని.. సొంతంగా కష్టపడి ఎదిగిన సుందర్ పిచాయ్ ఇమేజ్ ను చెన్నైలోని పలు స్కూళ్లు వాడేస్తుంటాయని చెబుతుంటారు. తమ పూర్వ విద్యార్థి గా పలు స్కూళ్లు సుందర్ పిచాయ్ ను తమ వాడంటే.. తమవాడని పేర్కొనటం కనిపిస్తూ ఉంటుంది. దీంతో.. సుందర్ పిచాయ్ తన బాల్యంలో ఏ స్కూల్లో చదివాడు?అన్న సందేహం నెలకొంది.

తాజాగా ఆ డౌట్ ను తీర్చేశారు గూగుల్ బాస్. అంతేకాదు.. సుందర్ పిచాయ్ కు సంబంధించిన మరో వాదన కూడా ప్రచారంలో ఉంది. అతను ఇంటి వద్దనే చదువుకున్నాడంటూ సాగే ప్రచారంలోనే నిజం లేదని తాజాగా ఆయన తేల్చారు. తాజాగా ఆయన అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యేయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు బదులిస్తూ చెన్నైలో చదివిన స్కూల్ వివరాల్ని వెల్లడించారు.

చెన్నైలోని వనవాణి స్కూల్ లో స్కూలింగ్ చేసినట్లు చెప్పారు. ఐఐటీ మద్రాసు క్యాంపస్ లోపల ఈ స్కూల్ ఉంటుందని పేర్కొన్నారు. తాను ఇంటి వద్దే చదువుకున్నానంటూ సాగే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.

అంతేకాదు.. తన వికీపీడియా పేజీలో పేర్కొన్న సమాచారంలో బోలెడంత నకిలీ సమాచారం ఉందన్నారు. తన పేరుతో ఉన్న వికీలో తాను చదివిన స్కూళ్ల పేర్లు భారీగా ఉన్నాయని.. అందులోని రెండింటిలోనే తాను చదువుకున్నట్లు వెల్లడించారు.

సుందర్ పిచాయ్ ఇమేజ్ ను తమ వ్యాపారానికి వాడుకోవటానికి చెన్నైలోని పలు స్కూళ్లు.. ఆయన్ను తమ పాత స్టూడెంట్ గా పేర్కొంటూ ఉంటాయి. దీనికి తగ్గట్లే 2015లో గూగుల్ సీఈవోగా పిచాయ్ బాధ్యతలు చేపట్టిన వారం వ్యవధిలోనే ఆయన వికీ పేజీ 350 సార్లు మార్పులకు గురైందంటేనే.. ఎన్నెన్ని మార్పులు చోటు చేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచంలో టాప్ 100 ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మనోడు చోటు దక్కించుకున్నారు. 2008లో క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించిన టీంలో ఆయన సభ్యుడన్న సంగతి తెలిసిందే. ఏమైనా.. వికీలో పిచాయ్ కు సంబంధించిన సమాచారంలో ఎన్ని తప్పులు ఉన్నాయన్న విషయంతో పాటు.. ఆయన స్కూల్ పైనా స్పష్టత వచ్చేసిందని చెప్పాలి.