Begin typing your search above and press return to search.

మన పిచాయ్ ట్రంప్ కే సవాలు విసిరాడు

By:  Tupaki Desk   |   31 Jan 2017 9:58 AM GMT
మన పిచాయ్ ట్రంప్ కే సవాలు విసిరాడు
X
ఊహించని పరిణామం ఒకటి ట్రంప్ కు ఎదురైంది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వారం వ్యవధిలోనే వరుసపెట్టి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షడి తీరుపై సగటు అమెరికన్ల మాదిరే పెద్ద పెద్ద కంపెనీలు గళం విప్పుతున్నాయి. మెజార్టీముస్లిం దేశాల శరణార్థులపై ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి షాకిచ్చేలా ప్రముఖ కాఫీ షాప్ స్టార్ బక్స్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.

రానున్న ఐదేళ్ల వ్యవధిలో పది వేల శరణార్థులకు ఉద్యోగాలు ఇస్తామని పేర్కొంటూ ట్రంప్ కు షాకిచ్చిన స్టార్ బక్స్ వ్యవహారంపై ఆసక్తికర చర్చ సాగుతున్నవేళలో గూగుల్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. ఆ సంస్థ ఉద్యోగులు ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయటం విశేషం. దాదాపు రెండు వేల మంది గూగుల్ ఉద్యోగులు ట్రంప్ ఆదేశాల్ని నిరసిస్తూ రోడ్ల మీదకు వచ్చారు. ట్రంప్ జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన వారు.. ట్రంప్ కు చెంపపెట్టుగా 4 మిలియన్ల డాలర్ల సంక్షోబ నిధిని వలసదారుల సమస్యల కోసం గూగుల్ సమీకరించటం గమనార్హం.

గూగుల్ ఉద్యోగులు జరుపుతున్న ర్యాలీకి అమెరికాలోని మిగిలిన గూగుల్ క్యాంపస్ లు మద్దతు పలుకుతున్నాయి. ఉద్యోగుల ర్యాలీలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రసంగించటం విశేషం. వలసవాదుల్లో సుందర్ పిచాయ్ కూడా ఒకరు కావటం తెలిసిందే. ట్రంప్ ఆర్డర్ కు వ్యతిరేకంగా పాల్గొన్న ఉద్యోగులకు థ్యాంక్స్ చెప్పిన పిచాయ్.. వలసవాదుల విషయంలో ట్రంప్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని పేర్కొన్నారు. ఇక.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీబిన్ అయితే.. తానుకూడా వలసవాదినేనని.. శరణార్థినేనని మండిపడ్డారు.

ఆరేళ్ల వయసులో రష్యా నుంచి తాను అమెరికాకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాధమిక విలువలు.. విధానాల రూపుకల్పన విషయంలో చర్చ జరగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు. నిన్నటికి నిన్న సార్ట్ బక్స్ యజమాని విప్పిన గళం ట్రంప్ కు ఇబ్బందికరంగా మారితే.. తాజాగా గూగుల్ లాంటి కంపెనీ ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకించటంతో.. అమెరికా అధ్యక్షుడి తీరును తప్పు పట్టే వారిలో కంపెనీలు చేరటం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/