Begin typing your search above and press return to search.

విశాఖ వాసులకు చేదు అనుభవాన్ని ఇచ్చిన ఆదివారం

By:  Tupaki Desk   |   14 Nov 2021 5:06 AM GMT
విశాఖ వాసులకు చేదు అనుభవాన్ని ఇచ్చిన ఆదివారం
X
సెలవు రోజైన ఆదివారం వేళ.. అందరూ కాస్తంత రిలాక్స్ గా.. ఆలస్యంగా రోజును మొదలు పెట్టే వేళలో.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంతో విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు. భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీయటమే కాదు.. ఇప్పుడు వారికి కొత్త భయం పట్టుకునేలా చేసింది. దీనికి కారణం ఈ ఉదయం (ఆదివారం) 7.15 గంటల వేళలో భారీ శబ్దాలతో భూప్రకంపనలు రావటమే కారణం.

విశాఖలోని అక్కయ్యపాలెం.. మధురానగర్.. బీచ్ రోడ్డు.. తాటిచెట్ల పాలెం.. అల్లిపురం.. ఆసిల్ మెట్ట.. సీతమ్మధార.. రైల్వే స్టేషన్.. హెచ్ బీ కాలనీ.. బంగారమ్మ మెట్ట.. సింహాచలం.. అడవివరం.. గోపాలపురం ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.అప్పటివరకుఅంతా మామూలుగా ఉన్న వేళ ఒక్కసారిగా ఉదయం 7.15గంటల వేళ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భూమి కంపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల ధాటికి కొన్ని చోట్ల భవనాల పెచ్చులు కూడా ఊడినట్లుగా చెబుతున్నారు.అయితే.. ఈ భూప్రకంపనలకు సంబంధించి అసలేం జరిగిందన్న వివరాల్ని శాస్త్రవేత్తలు.. అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సండే వేళ చోటు చేసుకున్న ఈ షాకింగ్ పరిణామంతో విశాఖ వాసుల్లో కొత్త భయాలు అలుముకున్నాయని చెప్పక తప్పదు. రిక్టర్ స్కేల్ మీద విశాఖలో చోటు చేసుకున్న భూప్రకంపనలు ఎంతన్న విషయం తేలాల్సి ఉంది.

కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఫాల్ట్ లైన్ ఉందని.. ఆ కారణంగా విశాఖపట్నానికి భూకంపాలు.. సునామీల ముప్పు ఉందని గత ఏడాది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యయనం హెచ్చరించటం తెలిసిందే. తూర్పు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300కి.మీ. పొడవులన ఈ ఫాల్ట్ లైన్ ఉన్న విషయాన్ని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో బయటకు వెల్లడైంది. 16 మిలియన్ ఏళ్ల క్రితం ఈ ఫాల్ట్ లైన్ ఏర్పడినట్లు అప్పట్లో చెప్పారు.