Begin typing your search above and press return to search.

సండే గెలుపెవరిది? మునుగోడు ఫలితంపై ఉత్కంఠ.. బెట్టింగ్స్

By:  Tupaki Desk   |   4 Nov 2022 4:30 PM GMT
సండే గెలుపెవరిది? మునుగోడు ఫలితంపై ఉత్కంఠ.. బెట్టింగ్స్
X
దేశమంతా ఇప్పుడు మునుగోడు వైపే చూస్తోంది. ఇక్కడ గెలుపు ఎవరిదని ఆసక్తిగా గమనిస్తోంది. ఓవైపు అధికార టీఆర్ఎస్, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరాడాయి. కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం టీఆర్ఎస్, బీజేపీ నేతలంతా మునుగోడులో మోహరించారు. నేతల విన్యాసాలు, హామీలు, మునుగోడు ప్రజల మీద చూపించిన ప్రేమాభిమానాలు తారాస్థాయిలో రక్తికట్టాయి. మరి మునుగోడు ఓటరు ఎవరిని ఆదరించాడు? ఎవరిని గెలిపించాడన్నది ఈవీఎం మెషీన్లలో భద్రమైంది.

గతంలో జరిగిన హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఆయా నియోజకవర్గ ప్రజలకు ఊహించని ఆశలను చిగురింపచేశాయి. అదే కోణంలో ఉప ఎన్నిక వచ్చిందంటే ఆయా నియోజకవర్గ ప్రజలు రాజకీయ నేతలు ప్రకటించే వరాలనే ఊహించుకుంటూ ఊహాలోకంలో విహరిస్తుంటారు. మునుగోడులోనూ అచ్చం అలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి.

ఉప ఎన్నిక రావాలి తమకు అభివృద్ధి డబ్బులు, మద్యం రావాలనే జనాలు చూస్తున్నారు. అందుకే ఫోన్లు చేసి మరీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఒక పార్టీ నుంచి డబ్బులు, మద్యం తీసుకొని.. మరో పార్టీ నుంచి కూడా వాటిని తీసుకునేందుకు జనాలు డిమాండ్ చేస్తుండడమే ఇక్కడ చర్చనీయాంశమైంది.

కోట్లు ఖర్చు చేసిన పార్టీలన్నీ కూడా గెలుస్తామనే భరోసాను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుత నాయకులు, అధికార గులాబీ పార్టీ, మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ,సిట్టింగ్ స్థానం తమదే కాబట్టి ఆ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ప్రచారం నిర్వహించాయి. ఎన్ని వరాలు కురిపించినా కూడా గెలుపుపై ధీమాను మాత్రం ఏ పార్టీ వ్యక్తం చేయడం లేదు. అందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

ఈ ఆదివారం ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమైనా కూడా గెలుపుపై ఎవరూ కూడా పసిగట్టలేకపోతున్నారు. జనాలను అడిగినా ఎటు ఓటు వేశామన్నది చెప్పడం లేదు. దీంతో మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు విజేతలన్న విషయం ఈ ఆదివారం మాత్రమే బయటపడనుంది. అప్పటివరకూ అందరూ ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.