Begin typing your search above and press return to search.

యూపీ గెలుపులో మోడీ,షా త‌ర్వాత ఈయనే

By:  Tupaki Desk   |   13 March 2017 4:14 AM GMT
యూపీ గెలుపులో మోడీ,షా త‌ర్వాత ఈయనే
X
అనూహ్య మెజార్టీతో ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీకి దక్కిన అఖండ విజయాన్ని చూసి దేశమంతా ఆశ్చర్యపడింది. ఊహించని ఫలితాలు రావడంతో విపక్షాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చరిష్మా - జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా వ్యూహ చతురతతోనే ఇదంతా సాధ్యమైందని విశ్లేషకులు భావించారు. ఇంతటి ఘన విజయం వెనుక మరోవ్యక్తి కీలకపాత్ర పోషించారు. ఆయనే సునీల్ బన్సల్ (47). క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికలు పూర్తయ్యేవరకు అన్నీ తానై నడిపించారు. అందుకే బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఆయన్ను హీరో ఆఫ్ 2017 బ్యాటిల్ అని కొనియాడారు.

2014 లోక్‌ సభ ఎన్నికల్లో యూపీలో అమిత్‌ షాకు సహాయం చేయడానికి రాజ‌స్తాన్‌ జైపూర్ ఏబీవీపీ జనరల్ సెక్రటరీగా ఉన్న సునీల్ బన్సల్‌ ను పంపాలని ఆర్‌ ఎస్‌ ఎస్ నిర్ణయించింది. యూపీకి చేరుకున్న బన్సల్ తన పనితీరుతో అమిత్‌ షాను మెప్పించారు. దీంతో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో వచ్చారు. ఎన్నికలకు కొన్నినెలల ముందే యూపీకి చేరుకున్న బన్సల్ ముందుగా పార్టీ రాజకీయ సమీకరణాల్లో మార్పు తెచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అదనంగా వెయ్యిమందికి పదవులు కట్టబెట్టారు. అగ్రవర్ణాలను కాదని ఓబీసీలు-ఎంబీసీలకే పదవులన్నీ కట్టబెట్టి అగ్రవర్ణాలకే పరిమితమన్న భావనను తొలగించగలిగారు. 150 మంది టెక్నాలజీ తెలిసిన కార్యకర్తలను ఎంపికచేసుకొని పార్టీ రోజువారీ కార్యక్రమాలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వారిలో 95% మంది యూపీ వారే కావడం గమనార్హం. యూపీలో బీజేపీ సభ్యత్వం రెండు కోట్లు దాటించారు. ఆ తర్వాత బూత్ స్థాయిలో బలోపేతంపై దృష్టిసారించారు. రాష్ట్రంలో దాదాపు 1.47 లక్షల బూత్‌లు ఉండగా 1.08 లక్షల బూత్‌ లకు కమిటీలు వేశారు. బీజేపీ పట్టణాలకే పరిమితమన్న భావనను తొలగించేందుకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. పలువురు నాయకులు వ్యతిరేకించినా బీజేపీ ఇన్‌ చార్జీ ఓమ్ మాథుర్ సహాయంతో ఎన్నికల్లో పోటీచేయించి 327 పంచాయతీలు గెలుచుకున్నారు. దళిత - యువ - మహిళా సమావేశాలను నిర్వహించి ఆయా వర్గాలను ఆకట్టుకున్నారు.

ఇదే స‌మ‌యంలోనూ సోషల్‌ మీడియా ద్వారా యువతను పెద్ద ఎత్తున బీజేపీవైపు తిప్పుకున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ బన్సల్ పెద్దఎత్తున కసరత్తు చేశారు. గెలువగలిగే అభ్యర్థుల జాబితా తయారు చేయడానికి తన బృందంతో నియోజకవర్గాల్లో నాలుగు రకాల సర్వే చేశారు. వచ్చిన ఫలితాల ఆధారంగా నివేదిక రూపొందించి అధిష్ఠానానికి అందజేశారు. బన్సల్ ఎవరు చెప్పినా వినడని, అహం ఎక్కువని పార్టీలోని ఓ బృందం వ్యతిరేకించినా అమిత్‌ షా ఆయనవైపే మొగ్గు చూపారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ బన్సల్ బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఇలా బీజేపీకి యూపీని పువ్వుల్లో పెట్టి అందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/