Begin typing your search above and press return to search.

ఇలాంటి ఎమ్మెల్యే మ‌న‌కి ఒక్క‌రైనా ఉన్నారా?

By:  Tupaki Desk   |   25 Sep 2017 5:21 AM GMT
ఇలాంటి ఎమ్మెల్యే మ‌న‌కి ఒక్క‌రైనా ఉన్నారా?
X
ఎమ్మెల్యే అంటే.. హంగు ఆర్భాటం - చుట్టూ మందీ మార్బ‌లం. త‌న‌ మాట‌కు ఎవ‌రూ ఎదురు చెప్ప‌కూడ‌దు. అంద‌రూ త‌న‌నే ఫాలో కావాలి. తానేం చెప్పినా వినాలి. అధికారులైతే వంగి వంగి మ‌రీ ద‌ణ్ణాలు పెడుతూ చెప్పిన ప‌ని చేయాలి. ఇదీ ప్ర‌స్తుతం దేశంలోని చాలా మంది ఎమ్మెల్య‌ల ప‌రిస్థితి. అయితే, అంద‌రూ ఒకేలా ఉంటే.. ప్ర‌స్తుత వార్త మ‌నం చ‌దువుకునే ఛాన్స్ ఉండేదికాదు. ఇప్ప‌డు చొప్పుకోబోతున్న ఎమ్మెల్యే చాలా స్పెష‌ల్‌. ఆయన రూటే సెప‌రేటు! అంద‌రిలాగా కాకుండా ఆయ‌న త‌న‌దైన పంథాను ఫాలో అవ‌డంలో ఫ‌స్ట్ ఉంటారు. ప్ర‌జ‌లు త‌న‌కు ఓటేసింది.. వారిపై పెత్త‌నం చ‌లాయించ‌డానికి కాదంటూ.. నిజ‌మైన సేవ‌లో త‌రిస్తున్నారు. వారికి ఏ ఆప‌ద వ‌చ్చినా క్ష‌ణాల్లో స్పందిస్తున్నారు. త‌న స్పెషాలిటీ చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశంలో అంద‌రిక‌న్నా బెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించి.. ప్ర‌జ‌ల‌తో జేజేలు అందుకుంటున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ లోని ఫరూఖాబాద్‌ జిల్లా సర్దార్‌ శాసనసభ నియోజకవర్గంలో బీజేపీ త‌ర‌ఫున గెలిచారు మెజొర్‌ సునీల్‌ దత్‌ ద్వివేది. అంద‌రిలాగా ఆయ‌న అధికారం చ‌లాయించాల‌ని అనుకోలేదు. మంచి మనసుతో తన ప్రత్యేకత చాటుకోవాల‌నుకున్నారు. మానవత్వం ప్రదర్శించి అందరి మన్ననలు అందుకోవాల‌నుకున్నారు. ఆపదలో ఉన్న వారిని సరైన సమయంలో ఆదుకుని నిజమైన ప్రజా సేవకుడిగా నిలిచారు. ఎవరూ ఊహించని విధంగా క్షతగాత్రులను తన వీపుపై మోసి అందరి హృదయాలను గెలిచారు. తాజాగా ఫరూఖాబాద్‌-ఫతేగఢ్‌ మార్గంలో ద్వివేది తన వాహనంలో ఇంటికి వెళుతుండగా ఓ హృదయ విదారక దృశ్యం ఆయన కంటపడింది.

భీంసేన్‌ మార్కెట్‌ సమీపంలో ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో రోడ్డు మధ్యలో పడివున్నారు. వీరిని గమనించిన ఆయన వెంటనే తన కారును ఆపి - క్షతగాత్రుల దగ్గరకు వెళ్లారు. తన అనుచరుల సహాయంతో గాయపడిన ముగ్గురిని తన కారులో సమీపంలోని లోహియా ఆస్పత్రికి తరలించారు. స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో ద్వివేది స్వయంగా ఒక క్షతగాత్రుడిని వీపుపై మోసుకెళ్లి అత్యవసర విభాగంలో చేర్చారు. క్షతగాత్రులు అరవింద్‌ సింగ్‌ చౌహాన్‌ - రిషబ్ - రామేశ్వర్‌ సింగ్‌ గా గుర్తించారు. ఇక‌, ఎమ్మెల్యే వెంట‌నే ఆస్ప‌త్రి సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాల‌ని సూచించారు. దీంతో ప్రాణాపాయం నుంచి ముగ్గురూ బ‌య‌ట‌ప‌డ్డారు. విష‌యం తెలిసిన ఉన్న‌తాధికారులు ఆస్ప‌త్రికి చేరుకుని వివ‌రాలు తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రులను స‌మ‌యానికి ఆస్ప‌త్రికి చేర్చ‌క‌పోయి ఉంటే ప్రాణాలు కోల్పోయేవార‌ని వైద్యులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో అంద‌రూ ఎమ్మెల్యే చేసిన సాయాన్ని ప‌దే ప‌దే గుర్తు చేసుకుని కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ద్వివేది గ‌తంలోనూ త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మే కాకుండా ఎక్కడ ఎవ‌రు ఆప‌ద‌లో ఉన్న స్పందించేవార‌ని అధికారులు ఈ సంద‌ర్భంగా మీడియాకు వెల్ల‌డించ‌డం విశేషం. మ‌న‌కు కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఒక‌రు ఉంటే చాలు క‌దా!!