Begin typing your search above and press return to search.

ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా గావస్కర్?

By:  Tupaki Desk   |   8 March 2022 4:25 AM GMT
ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా గావస్కర్?
X
విషయం ఏదైనా కానీ.. ఎప్పుడేం మాట్లాడాలంటే అది మాట్లాడటం సబబు కాదు. సమయం.. సందర్భం తప్పనిసరి. ఆ విషయాన్ని మర్చిపోయి అవసరం లేని వివాదంలో ఇరుక్కుపోయిన క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఉదంతం గురించి విన్నంతనే ఒళ్లు మండక మానదు. చిన్న వయసులోనే ప్రాణాలు పోయిన ఒక సీనియర్ క్రికెటర్ ను పట్టుకొని నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంలో అర్థమే లేదు. మనిషి మరణించిన వేళలో.. అతని స్థాయి గురించిన చర్చ అనవసరం. ఈ విషయాన్ని గావస్కర్ ఎలా మిస్ అయ్యారో కానీ.. తాజాగా ఆయన తీరును చాలామంది తిట్టిపోస్తున్నారు.

ఆసీసీ క్రికెట్ దిగ్గజం.. తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్ మెన్లను ముప్పతిప్పలు పెట్టిన షేన్ వార్న్అనూహ్యంగా మరణించటం తెలిసిందే. ఆయన మరణం తాలూకు షాక్ ఒక్క ఆస్ట్రేలియా ప్రజలనే కాదు.. క్రికెట్ ను అభిమానించే వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటివేళ.. ఒక ప్రోగ్రాంలో పాల్గొన్న సునీల్ గావస్కర్.. వార్న్ గురించి అవసరం లేని వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు.

భారత్ మీద వార్న్ రికార్డు చాలా సాధారణంగా ఉందని.. అతడ్ని దిగ్గజ స్పిన్నర్ అనలేమన్నారు. షేన్ వార్న్ గొప్ప చౌలరేకానీ దిగ్గజ స్పిన్నర్ అనలేమని.. అతడి కంటే భారత స్పిన్నర్లు.. శ్రీలంక స్పినర్ ముత్తయ్య మురళీధరన్ కూడా మెరుగ్గా బౌలింగ్ చేస్తారన్నారు. భారత్ పిచ్ ల మీద వార్న్ గణాంకాల్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. తన స్పిన్ తో భారత బ్యాట్స్ మెన్లను వార్న్ ఇబ్బంది పెట్టలేదన్నారు. వార్న్ కంటే ముత్తయ్య మురళీధరన్ కు భారత్ మీద మెరుగైన రికార్డు ఉందన్నాడు. అందుకే అతడ్ని దిగ్గజ స్పిన్నర్ గా భావించలేమన్న వ్యాఖ్యలు చేశారు.

వార్న్ మీద సునీల్ గావస్కర్ వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. వార్న్ మరణించి.. ఇంకా అంత్యక్రియులు పూర్తి కాని వేళలో ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? అన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి వ్యాఖ్యలకు ఇదేమాత్రం సరైన సమయం కాదన్నారు. దీనిపై ఇతర దేశాలకు చెందిన మీడియా సంస్థలు సైతం మండిపడుతున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటుగా ఫ్యాక్స్ న్యూస్ ఆగ్రహం వ్యక్తం చేస్తే.. సోషల్ మీడియాలోనూ ఇదే తరహా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తనకు తాను గొప్ప బౌలర్ ను.. దిగ్గజ క్రికెటర్ ను అని వార్న్ చెప్పుకుంటే తప్పు పట్టొచ్చు.

అందుకు భిన్నంగా అతడు మరణించిన వేళలో చెబుతున్న మాటపై గావస్కర్ లాంటోళ్లు మాట్లాడటం తప్పు కాదు తప్పున్నరే అని చెప్పక తప్పదు.