Begin typing your search above and press return to search.

ఇండియా అలా చేస్తే అమెరికా హాంఫట్

By:  Tupaki Desk   |   29 April 2017 8:59 AM GMT
ఇండియా అలా చేస్తే అమెరికా హాంఫట్
X
భార‌తీయులు స‌హా విదేశీ టెక్ నిపుణుల‌ను అడ్డుకునేందుకు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న త‌రుణంలో ఎయిర్ టెల్ చైర్మ‌న్ సునీల్ భార‌తీ మిట్టల్ ఘాటుగా స్పందించారు. భార‌త్ క‌నుక ప‌ట్టు బిగిస్తే అమెరికా సంస్థ‌ల ప‌రిస్థితి ఏమ‌వుతుందో తెలుసా అని ఆయ‌న మండిప‌డ్డారు. అమెరికన్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున కార్యకలాపాలున్న భారత్‌ కూడా ఇదే వైఖరి పాటిస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

విదేశీ సంస్థలు భారత్‌లో భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పుడు.. భారతీయ ఉద్యోగుల రాకపోకలపై ఆయా దేశాలు నియంత్రణలు విధించడం సరికాదన్నారు.అమెరికాలాగానే వ్యవహరిస్తే.. స్వదేశీ యాప్స్‌ అనేకం ఉండగా భారత్‌లో గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి అమెరికన్‌ టెక్‌ దిగ్గజాల కార్యకలాపాలను అనుమతించాల్సిన అవసరమేం ఉంటుందని ప్రశ్నించారు.

ఫేస్‌బుక్‌కు 20 కోట్ల మంది, వాట్సాప్‌కు 15 కోట్ల మంది, గూగుల్‌కు 10 కోట్ల మంది యూజర్లు భారత్‌లో ఉన్నారు. అలాంటప్పుడు మా సొంత యాప్స్‌ మాకున్నాయి.. మీరు మాకు అక్కర్లేదు అంటే ఎలా ఉంటుంది అని మిట్టల్‌ వ్యాఖ్యానించారు. భారత ఐటీ నిపుణులపై ప్రభావం చూపించేలా అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయడంపై ఆయన ఇలా ఘాటుగా స్పందించారు.

నిజ‌మే ఒక్క భార‌తే కాదు మిగ‌తా అన్ని దేశాలూ ఇదే ప‌ని చేస్తే అమెరికాకు చెందిన ఏ సంస్థా మ‌నుగ‌డ సాధించ‌లేదు. అప్ప‌టికి కానీ ట్రంప్ లాంటివాళ్ల‌కు తెలిసి రాదు.