Begin typing your search above and press return to search.

సునీల్ టీం అతి.. అందుకే కేసీఆర్ సర్కారుకు కాలిందా?

By:  Tupaki Desk   |   15 Dec 2022 3:57 AM GMT
సునీల్ టీం అతి.. అందుకే కేసీఆర్ సర్కారుకు కాలిందా?
X
మీడియా కావొచ్చు. సోషల్ మీడియా కావొచ్చు. తమ అభిప్రాయాల్ని సూటిగా.. స్పష్టంగా చెప్పే హక్కు.. అధికారం ఉంటుంది. అదే సమయంలో నిజాన్ని నిర్భయంగా చెప్పటానికి వీలుంది. కానీ.. పేరుకు మాత్రం నీతి.. నిజాయితీ అని చెబుతూనే.. మరోవైపు తమ బుర్రకు తోచినట్లుగా వార్చి వండేసి.. ఇస్టా రాజ్యంగా సోషల్ మీడియాలోనూ.. యూ ట్యూబ్ చానళ్లలోనే వడ్డించేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని తాజాగా తెలంగాణ పోలీసులు సైతం స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కమ్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయాన్ని సీసీఎస్ పోలీసులు సోదాలు చేయటం.. పలువురిని అదుపులోకి తీసుకోవటం.. నోటీసులు జారీ చేయటం లాంటి చర్యలు చేపట్టారు. సోషల్ ప్రచారం కావొచ్చు.. ఎన్నికల వ్యూహాల్ని అందించే వారు ఎవరైనా సరే.. దాదాపు ఒకేలాంటి మైండ్ సెట్ తో ఉంటారు. తాము ప్రాతినిధ్యం వహించే క్లయింట్ కు మైలేజీ దక్కేందుకు దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే.

ఇలాంటి అరాచకాలకు తెర తీసిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే సునీల్ గురువు.. ప్రశాంత్ కిశోర్ గా చెప్పాలి. ఆయన మొదలెట్టిన ఈ వ్యూహకర్తల బిజినెస్ మోడల్ అంతకంతకూ పెరిగి పెద్దదై.. ఇప్పుడున్న పరిస్థితికి తీసుకొచ్చింది. తాజా వ్యవహారంలోకి వెళితే.. సీసీఎస్ పోలీసులు కాంగ్రెస్ వ్యూహకర్త ఆఫీసుపై సోదాలు చేసే వరకు విషయం ఎందుకు వచ్చింది? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాదానంగా సీసీఎస్ పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ విషయాన్ని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్సీ కవిత.. ప్రధాని నరేంద్ర మోడీ.. టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లను టార్గెట్ చేసి.. అత్యంత దారుణమైన పోస్టులు.. చిట్టి వీడియోలు పోస్టు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. వాటికి ఉదాహరణగా రెండు వీడియో క్లిప్పింగులు ప్రదర్శించారు. టీవీల్లో వచ్చే వాణిజ్య ప్రకటనల కంటెంట్ ను మార్ఫింగ్ చేసి.. స్కూఫింగ్ చేయటం ద్వారా తమ టార్గెట్లను పూర్తి చేసేలా వ్యవహరిస్తున్నారు.

కేసీఆర్.. కేటీఆర్.. కవితలపై ఎక్కువ పెట్టిన విమర్శలకు సంబంధించిన రెండు వీడియోల్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ పోలీసులు పేర్కొంటున్నారు. అందులో ఒక బ్రాండ్ టీ తులసి తో కూడి ఉంటుంది. ఇది తాగితే అనారోగ్యం బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆ ప్రకటనను తమకు తగ్గట్లుగా మార్చేసి.. టీకి బదులుగా లిక్కర్ పెట్టేశారు. అందులో నటించిన నటీనటుల ముఖాల స్థానంలో కేసీఆర్.. కేటీఆర్.. కవితల ఫోటోలు పెట్టించి.. టీని లిక్కర్ గా చూపిస్తూ.. తమ లిక్కర్ తాగితే అనారోగ్యం తక్కువ అంటూ పేర్కొన్నారు. ఈ వీడియోపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరో వీడియో మరింత ఇబ్బందికరంగా ఉందంటున్నారు.

టెంపర్ సినిమాలో కొన్ని డైలాగుల్ని మిక్స్ చేసి.. బండి సంజయ్.. కిషన్ రెడ్డి.. ఎంపీ అరవింత్ ఫోటోలని మార్ఫింగ్ చేసి మోసగాళ్లుగా చిత్రీకరిస్తూ వీడియోను తయారు చేశారు. మరో వీడియోలో ఒక మాయా పెట్టెను ఓపెన్ చేస్తే.. ఎవరి మనసులో ఉన్నది వారికి కనిపిస్తుంది. ఆ వీడియోలో కేసీఆర్ కు భూములు.. కుటుంబ సభ్యులు.. కేటీఆర్ ఓపెన్ చేసినప్పుడు అభ్యంతరకర ఫోటోలు.. కవిత బాక్సు ఓపెన్ చేస్తే నగలు.. ఆస్తులు.. ప్రధాని మోడీ ఓపెన్ చేస్తే మాత్రం అదానీ.. అంబానీల ఫోటోలు కనిపించటం పైనా విమర్శలు వచ్చాయి. అందుకే.. విషయం కాస్తంత సీరియస్ గా మారి.. సోదాలు.. నోటీసుల వరకు విషయం వెళ్లిందన్న మాట వినిపిస్తోంది. పంచ్ లు వేయాలి. కానీ అవేవీ పర్సనల్స్ ను టార్గెట్ చేసినట్లుగా ఉండకూడదన్న విషయాన్ని సునీల్ అండ్ టీం మిస్ అయ్యిందా? అన్నది ఇప్పుడున్న ప్రశ్న.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.