Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్‌ కు మ‌రో సీనియ‌ర్ మ‌హిళా నేత గుడ్ బై!

By:  Tupaki Desk   |   26 March 2019 11:18 AM GMT
టీ కాంగ్రెస్‌ కు మ‌రో సీనియ‌ర్ మ‌హిళా నేత గుడ్ బై!
X
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఖాళీ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న గులాబీ బాస్ కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లే షాకుల మీద షాకులు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. పార్ల‌మెంటు ఎన్నిక‌లు పూర్తి అయి.. ఫ‌లితాలు వచ్చే నాటికి తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ చేయాల‌న్న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే ఇటీవ‌ల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రిగా వీడిపోవ‌టం.. గులాబీ కండువా క‌ప్పుకోవ‌టం తెలిసిందే. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే.. నలుగురైదుగురు మిన‌హా మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేర‌తార‌ని.. గ‌తంలో టీడీపీ నేత‌లు ఏ రీతిలో అయితే పార్టీని విలీనం చేస్తారో అదే రీతిలో కాంగ్రెస్ ను చేస్తార‌ని చెబుతున్నారు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ మ‌హిళా నేత‌.. మాజీ మంత్రి మెద‌క్ జిల్లాకు చెందిన సునీతా ల‌క్ష్మారెడ్డి టీఆర్ ఎస్ లో చేరేందుకు రెఢీ అయ్యారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఆమె ఇప్ప‌టికే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను క‌లిశార‌ని.. ఆమె రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సంబంధించిన ఆయ‌న అభ‌య‌మిచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల వేళ‌..కాంగ్రెస్‌ నేత‌ల్లో మ‌నోస్థైర్యాన్ని త‌గ్గించ‌టంతో పాటు.. ఆ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న కొద్దిపాటి అభిమానాన్ని కోల్పోయేలా చేయ‌ట‌మే కేసీఆర్ ల‌క్ష్యమంటున్నారు. తాము ఓటేసి గెలిపించినా.. త‌ర్వాత టీఆర్ ఎస్ లో చేరిక ఖాయ‌మైన వేళ‌.. వారికి ఓటేసే బ‌దులు గులాబీ అభ్య‌ర్థుల‌ను గెలిపించ‌టం మంచిద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లోక‌లిగేలా చేయ‌టం కూడా వ్యూహ‌మంటున్నారు.

ఒక‌వేళ‌.. కేసీఆర్ కోరిన‌ట్లు 16 ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోకుంటే.. ఒక‌ట్రెండు ఎంపీ స్థానాల్ని కాంగ్రెస్ గెలిస్తే.. అసెంబ్లీలో ఆ పార్టీ మూలాలూ లేకుండా చేసే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ ఉనికి అన్న‌ది లేకుండా చేయ‌ట‌మే గులాబీ బాస్ ల‌క్ష్య‌మంటున్నారు. మ‌రి.. కాలం ఎలాంటి సీన్ చూపిస్తుందో చూడాలి.