Begin typing your search above and press return to search.

ఇలా చేస్తే మ‌ళ్లీ ఎంపీగా గెల‌వ‌రు స‌న్నీ బాబు!

By:  Tupaki Desk   |   2 July 2019 8:06 AM GMT
ఇలా చేస్తే మ‌ళ్లీ ఎంపీగా గెల‌వ‌రు స‌న్నీ బాబు!
X
ఓట్లేసి గెలిపించే వ‌ర‌కూ మీకు అంత చేస్తా.. ఇంత చేస్తా? మీ బ‌తుకుల్ని మార్చేస్తా అంటూ భారీ హామీలు ఇచ్చే నేత‌లు.. ఒక్క‌సారి గెలిచిన త‌ర్వాత ఎలా త‌యార‌వుతారో తెలిపే ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు. సినిమాల‌కు.. రాజ‌కీయాల‌కు మ‌ధ్య‌నున్న అవినాభావ సంబంధంతో తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల బరిలో నిలిచి.. గెలిచారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌న్నిడియోల్. గురుదాస్ ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న తాజాగా రాసిన ఒక లేఖ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.

త‌న‌కు బ‌దులుగా త‌న ప్ర‌తినిధిని ఒక‌రిని నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో నియ‌మిస్తున్న‌ట్లుగా స‌న్నీ పేర్కొన్నారు. మొహాలి జిల్లా ప‌ల్హేరీ గ్రామానికి చెందిన గురుప్రీత్ సింగ్ ను త‌న ప్ర‌తినిధిగా నియ‌మిస్తున్నాన‌ని.. ఇక‌పై నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో జ‌రిగే అన్ని కార్య‌క్ర‌మాల‌కు త‌న త‌ర‌ఫున అత‌డే హాజ‌ర‌వుతార‌ని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖ‌ను విడుద‌ల చేశారు.

దీంతో.. విప‌క్షాలు ఇప్పుడు విరుచుకుప‌డుతున్నాయి. న‌మ్మ‌కంతో ఓట్లు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల్ని మోసం చేయ‌ట‌మేన‌ని వ్యాఖ్యానిస్తున్నాయి. ఓట‌ర్లు ఒక వ్య‌క్తిని ఎన్నుకుంటే.. అత‌ను మ‌రో వ్య‌క్తిని ఎలా నియ‌మిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం పంజాబ్ లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే.. స‌న్నీ నియ‌మించిన గురుప్రీత్ సింగ్ స్పందిస్తూ.. స‌న్నీ ఉద్దేశంతో 24 గంట‌లు ప్ర‌జాసేవ‌లో ఉండ‌టంలో భాగంగానే ఈ ప‌ని చేశారే త‌ప్పించి.. ఇంకేం లేద‌ని స‌మ‌ర్థించే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌తి నెలా స‌న్నీ స్వ‌యంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ఓట్లేసి గెలిపించిన ఎంపీ ఒక‌రు ఈ తీరులో లేఖ రాయ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచుకోవ‌ట‌మే కాదు.. త‌ప్పుడుసంకేతాల‌కు అవ‌కాశం ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది. మొత్తానికి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగి గెలిచిన స‌న్నీ ఈ తీరులో వ్య‌వ‌హ‌రించ‌కుండా ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.