Begin typing your search above and press return to search.

ఇత‌డినా స‌న్‌రైజ‌ర్స్ వ‌ద్ద‌నుకున్న‌ది

By:  Tupaki Desk   |   16 Nov 2021 4:17 AM GMT
ఇత‌డినా స‌న్‌రైజ‌ర్స్ వ‌ద్ద‌నుకున్న‌ది
X
డేవిడ్ వార్న‌ర్‌ను ఒక నెల ముందు చూసి అంద‌రూ జాలిప‌డ్డారు. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్యత‌ల నుంచి త‌ప్పించ‌బ‌డ‌ట‌మే కాక‌.. తుది జ‌ట్టులోనూ చోటు కోల్పోయి ఐపీఎల్ కెరీర్లో ఎన్న‌డూ లేని సంక్లిష్ట స్థితిని ఎదుర్కొన్నాడు వార్న‌ర్. ఏ ఆట‌గాడికైనా ఏదో ఒక ద‌శ‌లో ఫామ్ లేమి స‌హ‌జం. కొన్నిసార్లు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు రాణించ‌లేక‌పోవ‌డం ఎవ‌రికైనా జ‌రుగుతుంది. వార్న‌ర్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో అత‌ను అనుకున్నంత‌గా రాణించ‌లేక‌పోయాడు. అదే స‌మయంలో మిగ‌తా జ‌ట్టంతా ఘోరంగా విఫ‌ల‌మై వార్న‌ర్ మీద ప్ర‌భావం ప‌డింది. ఇన్నేళ్లు జ‌ట్టును గొప్ప‌గా న‌డిపించి, ఒక సీజ‌న్లో విజేత‌గా కూడా నిలిపిన వార్న‌ర్ విష‌యంలో స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం ఓపిక‌తో వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోయింది. అత‌ణ్ని జ‌ట్టు నుంచి త‌ప్పించేసింది.

ఐతే వార్న‌ర్‌పై వేటు వేసి.. జ‌ట్టులో మార్పులు చేసినా, విలియ‌మ్స‌న్‌కు ప‌గ్గాల‌ప్ప‌గించినా స‌న్‌రైజ‌ర్స్ రాత మార‌లేదు. అట్ట‌డుగు స్థానంతోనే ఈ ఐపీఎల్ సీజ‌న్‌ను ముగించింది. వార్న‌ర్‌పై వేటు వేయ‌డ‌మే కాక అత‌డితో అమ‌ర్యాద‌క‌రంగా వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది స్ప‌ష్టం. అందుకే ఆ జ‌ట్టును వీడాల‌నుకున్నాడు వార్న‌ర్. అయినా స‌రే.. అత‌ణ్ని స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం వారించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా క‌నిపించ‌లేదు. త‌న ప‌ట్ల తెలుగు అభిమానులు చూపించిన ప్రేమ ఎలాంటిదో వార్న‌ర్‌కు తెలుసు. అందుకే స‌న్‌రైజ‌ర్స్‌కు దూర‌మ‌వుతుండ‌టం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇంకా ఆ జ‌ట్టుకు ఆడాల‌నే ఉంద‌న్నాడు. కానీ స‌న్‌రైజ‌ర్స్ నుంచి స్పంద‌న లేదు. క‌ట్ చేస్తే ఐపీఎల్ త‌ర్వాత ప్ర‌పంచ‌క‌ప్‌లో వార్న‌ర్ అద‌ర‌గొట్టాడు. నిల‌క‌డ‌గా రాణించి ఆసీస్ తొలిసారి పొట్టి క‌ప్పు అందుకోవ‌డానికి తోడ్ప‌డ్డాడు. అత‌డే ప్లేయర్ ఆఫ్ ద టోర్న‌మెంట్ కావ‌డం విశేషం. ఈ ప్ర‌ద‌ర్శ‌న చూశాక వార్న‌ర్ ఫ్యాన్స్ స‌న్‌రైజ‌ర్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ఆట‌గాడినా మీరు వ‌ద్ద‌నుకున్న‌ది అని ఎద్దేవా చేస్తున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఐపీఎల్ వేలంలో వార్న‌ర్‌కు మంచి డిమాండే ఏర్ప‌డొచ్చు. లీగ్‌లోకి కొత్తగా అడుగు పెడుతున్న రెండు జ‌ట్ల‌లో ఒక‌దానికి వార్న‌ర్ కెప్టెన్ అయ్యే అవ‌కాశాలున్నాయి.