Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో మళ్లీ సన్ రైజింగ్ కావాలంటే.. భారీ మార్పులే శరణ్యం

By:  Tupaki Desk   |   14 Dec 2022 10:20 AM GMT
ఐపీఎల్ లో మళ్లీ సన్ రైజింగ్ కావాలంటే.. భారీ మార్పులే శరణ్యం
X
ఆరేళ్లయింది టైటిల్ గెలిచి.. ఇన్నేళ్లలో చాలా మారాయి.. గతేడాది నుంచి లఖ్ నవూ, గుజరాత్ కొత్తగా వచ్చాయి. మేటి జట్లయిన ముంబై, చెన్నై వెనుకబడిపోయాయి. బెంగళూరు కాస్త బలం పుంజుకుంది.. కోల్ కతా ఊగిసలాడుతోంది.. పంజాబ్, ఢిల్లీ రాత మారలేదు. మరి మన సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) కథేంటి...? 2016 లో విజేతగా నిలిచిన హైదరాబాద్ మళ్లీ కప్ ఛాయలకే పోలేదు. పైగా రాన్రాను ప్రదర్శన దిగజారిపోతోంది. సీనియర్ భువనేశ్వర్ ఫామ్ లో లేడు. అతడి స్వింగ్ మంత్రం పనిచేయడం లేదు. బ్యాటింగ్ లో వార్నర్ ను వదులుకున్నారు. బౌలింగ్ లో రషీద్ ఖాన్ ను చేజార్చుకున్నారు. ఉమ్రాన్ మాలిక్ వంటి స్పీడ్ స్టర్ ను తెచ్చినా.. అతడి వేగం మ్యాచ్ లను గెలిపించడం లేదు. అసలు జట్టులో మ్యాచ్ విన్నింగ్ బ్యాట్స్ మెన్ కానీ.. బౌలర్లు కానీ ఎవరైనా ఉన్నారా? అనే అనుమానం వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ మినీ వేలానికి వేళవుతోంది. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏం చేస్తున్నది..? ప్రక్షాళనకు సిద్ధమవుతున్నదా?

మార్చాల్సినవి ఎన్నో..?బ్యాటింగ్ లో దమ్ము పెరగాలి.. బౌలింగ్ లో పదునుండాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే వార్నర్ లాంటి బ్యాట్స్ మన్ ను, రషీద్ ఖాన్ లాంటి బౌలర్ ను వెదికి పట్టుకోవాలి. అప్పుడే సన్ రైజర్స్ టైటిల్ కొట్టగలదంటే నమ్మగలం. అయితే, అలాంటి ఆటగాళ్లను పట్టుకోవడం ఏమోగానీ.. ప్రస్తుతమైతే కొన్ని మార్పులు చేసింది ఎస్ఆర్ హెచ్. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ పూరన్, ఆస్ట్రేలియా పేస్ ఆల్ రౌండర్ సీన్ అబాట్ ను వదులుకుంది. అయితే, ఇది సరిపోదు. కొత్తగా ఎవరిని తీసుకుంటున్నారనేది కీలకం. కాగా, ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ సహా పలు జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను ఇచ్చాయి. దీంతో తాము ఎవరిని రిలీజ్ చేయనున్నామో సన్‌ రైజర్స్ యజమాని కావ్య మారన్ వెల్లడించారు.

ఫ్యాన్స్ కు ఓకే.. మరి విలియమ్సన్, పూరన్, అబాట్ లను రిలీజ్ చేయడాన్ని సన్ రైజర్స్ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. అయితే, ఇందులో కాస్త విశ్లేషణలోకి వెళ్తే..విలియమ్సన్, అబాట్ లను పక్కన పెట్టడం వరకు కరెక్టే. కానీ, పూరన్ ను మాత్రం కొనసాగించాల్సింది. అతడు వెస్టిండీస్ జట్టు రెగ్యులర్ సభ్యుడే కాక.. వివిధ లీగ్ లలో ఆడుతున్నాడు. యువకుడు. దూకుడు ఉన్నవాడు. కాకపోతే పూరన్ ను సన్ రైజర్స్ సరిగా వినియోగించుకోలేకపోయింది. ఇక విలియమ్సన్ గురించి చెప్పేదేముంది? కాకపోతే కొంతకాలంగా అతడు ఫామ్ లో లేడు. 2017-18 మధ్య విలియమ్సన్ నుంచి గొప్ప గొప్ప ఇన్నింగ్స్ వచ్చాయి.

ఇప్పుడు మాత్రం టి20లకు తగనివాడిగా మారాడు. అతడిని న్యూజిలాండ్ టెస్టులు, వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా ఉంచినా ఆశ్చర్యం లేదు. విలియమ్సన్ ధర రూ.14 కోట్లు. ఈ మొత్తం వేరొక కీలక ఆటగాడిపై వెచ్చించే అవకాశం దొరకనుంది. మరోవైపు అబాట్‌ ఔట్ డేటెడ్. అతడికి ఆస్ట్రేలియా జట్టులోనే స్థానం లేదు. గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి 47 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ మాత్రమే తీశాడు. లోయరార్డర్ లో బ్యాట్ ఝళిపించగలడని నమ్మకం పెట్టుకున్నా.. అది కూడా నెరవేర్చడం లేదు. సన్‌రైజర్స్ కు మరిన్ని పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో వేలంలో మరో మంచి ఆల్‌రౌండర్ కోసం ఖర్చు పెట్టాలంటే అబాట్‌ను వదిలించుకోవడమే బెటర్.

రొమారియో.. వద్దయ్యో..నిరుడు వేలంలో సన్ రైజర్స్ చేతులు కాల్చుకుంది. రషీద్ ఖాన్ ను వదులుకుని నోరెళ్లబెట్టింది. కొందరు భారీ హిట్టర్లను కొనాలని అనుకున్నా.. వారు చేజారిపోయారు. ఆ తొందరలో వెస్టిండీస్ ప్లేయర్‌ రొమేరియో షెఫర్డ్‌ను రూ.7.75 కోట్లు ఖర్చు పెట్టి కొనేసింది. అయితే, మూడు మ్యాచులు ఆడిన అతను మూడు వికెట్లు తీసి, 58 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో పెద్దగా సత్తా చూపలేకపోవడమే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో మంచి ఇన్నింగ్స్ లు ఆడడంలో విఫలమయ్యాడు. దీంతో ఈసారి పూర్తిగా పక్కనపెట్టారు. అయితే, షెఫర్డ్‌కు మరో ఐపీఎల్ కాంట్రాక్ట్ దొరికినా.. డబ్బు మాత్రం గతంలో అంతగా రాదు.

ఆటగాళ్లు కాదు.. ఆట ముఖ్యం పేరున్న ఆటగాళ్లు, భారీ హిట్టర్లు, యార్కర్ కింగ్ లు కాదు.. ఒక జట్టు గెలవాలంటే కూర్పు ముఖ్యం. ఉదాహరణకు గతేడాది గుజరాత్ విజయాన్ని తీసుకోండి. అందులో రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్యా, మిల్లర్ మినహా పెద్దగా పేరున్నవారు లేరు. కానీ, ఆ జట్టు విజేతగా నిలిచింది. దీన్నిబట్టి చెప్పేది ఏమంటే ఎంత గొప్ప క్రీడాకారులను తీసుకున్నా.. వారిని ఎలా సమన్వయం చేయాలో తెలిసుండాలి. అలాగేతేనే కప్ కొట్టగలం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.