Begin typing your search above and press return to search.

క్రికెట్ లో మళ్లీ సూపర్ సబ్ స్టిట్యూట్ ? తెలుగువారితో ప్రత్యేకత తెలుసా?

By:  Tupaki Desk   |   18 Sep 2022 2:30 AM GMT
క్రికెట్ లో మళ్లీ సూపర్ సబ్ స్టిట్యూట్ ? తెలుగువారితో ప్రత్యేకత తెలుసా?
X
''సూపర్ సబ్ స్టిట్యూట్..'' క్రికెట్ లో ఓ పదిహేనేళ్ల కిందట వరకు సంచలనాత్మక ప్రయోగం. మైదానంలో దిగిన 11 మంది కాక.. ఆట మధ్యలో మరో ఆటగాడిని తీసుకునే సౌలభ్యం ఇది. టి20లకు ముందు.. వన్డేలను జనరంజకంగా మార్చాల్సిన సమయంలో ''సూపర్ సబ్ స్టిట్యూట్'' ఆలోచనను తీసుకొచ్చారు. అయితే ఇది పెద్దగా విజయవంతం కాలేదు. ఎందుకనో కానీ.. ప్రయోగం బెడిసికొట్టినట్లయింది. దీంతో ఎక్కువ కాలం కొనసాగించలేదు. ఈలోగా టి20 ఫార్మాట్ క్రికెట్ రావడంతో సూపర్ సబ్ స్టిట్యూట్ ను అందరూ మర్చిపోయారు.

ఎలా తీసుకుంటారు?

సహజంగా క్రికెట్ జట్టులో 11 మంది మైదానంలోకి దిగే సంగతి తెలిసిందే. వీరు కాక మరో ఆటగాడిని 12వ నంబరుగా చూపుతారు. అతడే సూపర్ సబ్ స్టిట్యూట్. ఆటకు ముందుగానే ఈ సూపర్ సబ్ స్టిట్యూట్ పేరును ప్రకటించాల్సి ఉంటుంది. ఇతడిని మధ్యలో దించుకునే అవకాశం ఉంటుంది. 2005-06 సీజన్ లో అనుకుంటా..? భారత క్రికెట్ జట్టు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఇందులో ప్రత్యేకత ఏమంటే టీమిండియా తొలి సూపర్ సబ్ స్టిట్యూట్ ఆటగాడు మన తెలుగువాడైన వై.వేణుగోపాలరావు.

మరో విశేషమంటే.. మొత్తం క్రికెట్ లోనే తొలి సూపర్ సబ్ భారతీయ మూలాలున్న వ్యక్తి. ఇంగ్లండ్ ఆటగాడు విక్రమ్ సోలంకికి ఈ ఘనత దక్కింది. కాగా, వేణుగోపాలరావు విశాఖకు చెందినవాడు. రంజీల్లో ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడాడు. 2005లో టీమిండియాకు ఎంపికయ్యాడు. మొత్తం 16 వన్డేలు ఆడాడు. పాకిస్థాన్ పై 61 పరుగులు చేశాడు. ఇదే అతడి అత్యధిక స్కోరు. ఏకైక అర్థ సెంచరీ కూడా ఇదే. తదనంతర కాలంలో అవకాశాలు రాకపోవడం, రాణించకపోవడంతో టీమిండియాకు దూరమయ్యాడు. గత ఎన్నికల సమయంలో జనసేన వైపు మొగ్గు చూపాడు.

మళ్లీ తెరపైకి

వన్డేలు జన రంజకంగా లేని సమయంలో సూపర్ సబ్ నిబంధన తీసుకొచ్చారు. నాడు విఫలమైంది. టి20ల రాకతో దానిని మర్చిపోయారు. మళ్లీ ఇప్పుడు ఆ ప్రతిపాదనను టీమిండియా మాజీ కోచ్ రవిశాస్ర్తి ప్రతిపాదిస్తున్నాడు. పొట్టి క్రికెట్‌లోకి ఈ నిబంధన తీసుకురావాలని కోరుతున్నాడు. ఇది టి20 స్వరూపాన్ని మార్చే గేమ్ చేంజర్ గా పేర్కొంటున్నాడు. అయితే, దీని వెనుక ఓ చిన్న కారణం ఉంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న'లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ)‌'లో ఈ కొత్త నిబంధనను తెచ్చారు.  'ఇండియా మహారాజాస్‌', 'టీమ్‌ వరల్డ్‌ జెయింట్స్‌' జట్ల మధ్య శుక్రవారం నిర్వహించిన స్పెషల్‌ బెనిఫిట్‌ మ్యాచ్‌లో 'సూపర్‌ సబ్ స్టిట్యూట్‌'ను అమలు చేశారు. 10వ ఓవర్‌ అనంతరం ఇరు జట్లు సూపర్‌ సబ్ స్టిట్యూట్‌ను వాడుకోవచ్చు.

ఇదివరికటి లాగే  ఆట ప్రారంభానికి ముందే సూపర్‌ సబిస్టిట్యూట్‌ ఆటగాళ్ల పేర్లను ఇరు జట్లు వెల్లడించాలి. ఈ మ్యాచ్ కు కమిషనర్‌గా రవిశాస్త్రి వ్యవహరించాడు. ఆ సమయంలోనే గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డాడు. 'క్రికెట్ ఏటా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా భవిష్యత్‌లో ఈ నియమాన్ని ఉపయోగించవచ్చు. టి20 ఫార్మాట్ లో అందుకు అవకాశం ఉంది.. ఇలాంటి టోర్నమెంట్లలో లేదా ఐపీఎల్ లో‌, బిగ్‌బాష్‌లో సొంత నియమాలు రూపొందించుకోవచ్చు. మీరు ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనుకుంటే ఈ నిబంధనను ప్రయత్నించొచ్చు' అని  రవిశాస్త్రి అన్నాడు. ఎల్‌ఎల్‌సీలో గుజరాత్‌ జెయింట్స్‌, ఇండియా క్యాపిటల్స్‌, మణిపాల్‌ టైగర్స్‌, భిల్వారా కింగ్స్‌ ఆడుతున్నాయి. 6 వేదికల్లో 16 మ్యాచ్‌లు జరగనున్నాయి.

అవసరమా అంటే ఆలోచించాల్సిందే?

టి20లకు ప్రస్తుతం ప్రజాదరణకు కొదవలేదు. అందులోనూ ఐపీఎల్ అంటే అదరహో. ఇలాంటి సమయంలో సూపర్ సబ్ స్టిట్యూట్ నిబంధన గురించి ఆలోంచిచవచ్చు. ఐపీఎల్ ఇప్పటికే 15 సీజన్లు గడిచింది. లీగ్ కు కొంత ఆకర్షణ తగ్గింది. మొదట్లో చీర్ గర్ల్స్, మెరుపులు ఇప్పుడు లేవు. ఏదైనా కొత్తగా చేస్తేనే చూడాలనిపించేలా ఉంది. ఈ నేపథ్యంలో సూపర్ సబ్ స్టిట్యూట్ గురించి ఆలోచించవచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.