Begin typing your search above and press return to search.

భూమికి చంద్రుడికి మధ్య దూరం తగ్గితే?

By:  Tupaki Desk   |   28 Sep 2015 6:18 AM GMT
భూమికి చంద్రుడికి మధ్య దూరం తగ్గితే?
X
ఖగోళంలో వింతలు విచిత్రంగా ఉంటాయి. ఎలా ఏర్పడతాయి.. ఎందుకు ఏర్పడతాయి? దాని వల్ల ఏం జరుగుతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభిస్తున్నా.. వాటి వల్ల జరిగే ప్రభావాన్ని చవి చూడటమే తప్పించి.. వాటిని ఏమాత్రం నియంత్రించలేని పరిస్థితి. ప్రకృతి ముందు మనిషి ఎంత అల్పుడనే విషయం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంటుంది.

తాజాగా మరో ఖగోళ వింత చోటు చేసుకుంది. భూమికి.. చంద్రుడికి మధ్యనున్న దూరం భారీగా తగ్గే సందర్భంగా భారీగా కనిపించే చంద్రుడ్ని.. సూపర్ మూన్ అని వ్యవహరిస్తుంటారు. అలాంటి అరుదైన విశేషం తాజాగా చోటు చేసుకుంది. ఈ నెల 14న భూమికి దగ్గరగా వచ్చిన చంద్రుడు మరోమారు దగ్గరగా వచ్చారు. సాధారణంగా భూమికి.. చంద్రుడికి మధ్యన ఉండే దూరం.. ఈ సూపర్ మూన్ సందర్భాల్లో దాదాపుగా 50వేల కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. 49,587 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

ఇలా తగ్గిన సందర్భాల్లో చంద్రుడు మరింత పెద్దగా కనిపించటం జరుగుతుంది. దీంతో పాటు ఇంకే జరుగుతాయని చూసినప్పుడు.. చాలానే మార్పులు ఉంటాయి. భూమికి చంద్రుడు అతి సమీపంలోకి వచ్చిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం.. తీవ్ర పోటు ఏర్పడటం లాంటివి చోటు చేసుకుంటాయి. దీంతో.. ఈ నెల 28 నుంచి 30 వరకు సముద్రంలో మార్పులు ఎక్కువగా ఉంటాయి.

సముద్రం ముందుకు చొచ్చుకు రావటం.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కావటం.. సముద్రం.. నదులు సంగమం జరిగే చోటు ప్రవాహం భారీగా పెరగటం.. అలల తాకి ఎక్కువగా ఉండటం.. అలల ఎత్తు సాధారణంగా కంటే కూడా రెండు మీటర్ల ఎత్తు ఎక్కువగా ఉండటం లాంటివి చోటు చేసుకుంటాయి. అయితే.. దేశంలోని అన్నీ ప్రాంతాల్లో కాకుండా.. కొన్ని ప్రాంతాల్లోనే ఇలాంటివి చోటు చేసుకోవటం ఒక విశేషం. మొత్తంగా సూపర్ మూన్ కారణంగా అల్లకల్లోలంగా ఉండే సముద్రం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.