Begin typing your search above and press return to search.

ఏపీలో కేసీఆర్ పార్టీకి తొలి మ‌ద్ద‌తు ఈ నేత నుంచే!

By:  Tupaki Desk   |   6 Oct 2022 6:46 AM GMT
ఏపీలో కేసీఆర్ పార్టీకి తొలి మ‌ద్ద‌తు ఈ నేత నుంచే!
X
జాతీయ రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున దేశ‌వ్యాప్తంగా అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించి త‌న స‌త్తా చాటాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. త‌ద్వారా కేంద్రంలో అధికార బీజేపీకి షాకివ్వాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీకి అనుకూలంగా, వ్య‌తిరేకంగా అనేక కామెంట్స్ వ‌స్తున్నాయి.

ముఖ్యంగా మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు టీడీపీ, జ‌న‌సేన వంటివి బీఆర్ఎస్ పై స్పందించ‌లేదు. ఇక అధికార వైసీపీ అయితే కేసీఆర్ పార్టీని లైట్ తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. వైసీపీ నేత‌ల కామెంట్లు ఈ దిశ‌గానే ఉన్నాయి. తాము ఏ కూట‌మిలో, ఫ్రంట్ లో చేర‌బోమ‌ని వైసీపీ ముఖ్య నేత‌, ప్ర‌భుత్వ స‌లహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ వంటి నేత‌లు సైతం ఏపీలో బీఆర్ఎస్ ప్ర‌భావం ఉండ‌ద‌ని.. కేసీఆర్ ను ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మ‌బోర‌ని తేల్చిచెప్పారు. వ‌చ్చే 25, 30 ఏళ్లు వైఎస్ జ‌గ‌నే ముఖ్యమంత్రిగా ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌ట్టి మ‌ద్ద‌తు దొరికింది. రాజ‌మండ్రి 2014, 2019ల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్.. కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కేసీఆర్ మూడు భాష‌లు హిందీ, ఇంగ్లిష్, తెలుగుల్లో అన‌ర్ఘ‌ళంగా ప్ర‌సంగించ‌గ‌ల‌ర‌న్నారు. ఆయ‌నంత వాగ్దాటితో ఎవ‌రూ మాట్లాడ‌లేర‌ని ప్ర‌శంసించారు.

బీజేపీని వ్య‌తిరేకించే పార్టీకే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటు వేస్తాన‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. బీజేపీని వ్య‌తిరేకిస్తూ బీఆర్ఎస్ వ‌చ్చి.. దానికి మంచి చాన్సు ఉంటే.. త‌న ఓటు బీఆర్ఎస్‌కేన‌ని ఉండ‌వ‌ల్లి తేల్చిచెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, క‌మ్యూనిస్టులు పోటీలో లేక‌పోతే నోటాకు ఓటు వేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్‌లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. అయితే వీరెవ‌రూ కేసీఆర్‌తో సమానంగా ఉండరని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ మూడు భాష‌ల్లో అనర్గళంగా మాట్లాడగలరని గుర్తు చేశారు. కేసీఆర్ రాజకీయాలపై స్పష్టంగా మాట్లాడగల వ్యక్తి అని తెలిపారు.

కేసీఆర్ పెట్టిన కొత్త పార్టీ విజ‌య‌వంత‌మ‌వుతుందో, లేదో తెలియదన్నారు. అయితే ఆ పార్టీ వాయిస్ మాత్రం ప్రజలకు చేరుతుంద‌న్నారు. గతంలో కేసీఆర్ త‌న‌ను పిలిచి మాట్లాడారని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలో త‌న‌తో అన్ని విషయాలు పంచుకున్నార‌న్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు దిశ‌గా ఎందుకు ఆలోచన చేశారో వివరించారన్నారు.

జాతీయ పార్టీ పెట్టినా సరే కేసీఆర్ తెలంగాణను వదలరని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంతో పాటూ తెలంగాణ‌లోనూ కేసీఆర్ రాజకీయాలు చేస్తార‌న్నారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో సంతోషం క‌లిగింద‌ని చెప్పారు.

కేసీఆర్ ఎప్పుడు పిలిచినా తాను వెళతాన‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్‌ పిలిచినా పిలవకపోయినా తాను మాత్రం బీజేపీకి వ్యతిరేక‌మ‌ని స్ప‌ష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తివ్వాలంటే రాష్ట్రానికి రావాల్సిన హామీల‌ను నెర‌వేర్చాల్సిందేన‌ని అడిగితే బాగుండేద‌న్నారు. ఎందుకంటే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీకి ఆధిక్యత లేదన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.