Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని పంజాబ్ ఘ‌ట‌న‌ పై సుప్రీం క‌మిటీ.. సీరియ‌స్ యాక్ష‌న్‌

By:  Tupaki Desk   |   12 Jan 2022 8:41 AM GMT
ప్ర‌ధాని పంజాబ్ ఘ‌ట‌న‌ పై సుప్రీం క‌మిటీ.. సీరియ‌స్ యాక్ష‌న్‌
X
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో భద్రతా లోపాలు త‌లెత్త‌డం, ఆ వెంట‌నే ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌నను వాయిదా వేసుకుని వెళ్లిపోవ‌డం వంటి ఘ‌ట‌న‌లపై సుప్రీంకోర్టు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వం వహించనున్నారు. ఈమేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న పంజాబ్లోని ఫిరోజ్పూర్కు ప్రధాని వెళ్తుండగా.. అడ్డగించిన ఘటనపై ఈ కమిటీ విచారణ జరపనుంది.

పంజాబ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ ఏకపక్షంగా జరగకూడదన్న ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో జస్టిస్ ఇందూ మల్హోత్రాతోపాటు పంజాబ్-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, పంజాబ్ సెక్యూరిటీ ఏడీజీ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం వెల్లడించింది.

ప్రధాని మోడీ జనవరి 5న పంజాబ్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్లో మోడీ అడుగు పెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. "కొన్ని కారణాల వల్ల సభకు మోడీ హాజరు కావడం లేదు" అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ.. సభా వేదికపై ప్రకటించారు.

అయితే.. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోడీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది. భద్రతా లోపాల్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని, దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ విషయంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇదిలావుంటే.. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగాను తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. దేశాధినేత అయిన‌.. ప్ర‌ధానికే భ‌ద్ర‌త లేక‌పోతే..ఎలా అంటూ.. ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌గా.. కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీల మ‌ధ్య ఒక‌ర‌క‌మైన రాజ‌కీయ యుద్ధ‌మే జ‌రిగింది.