Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంపై సుప్రీంకోర్టులో ఏం జ‌రిగిందంటే..

By:  Tupaki Desk   |   7 Nov 2017 5:24 PM GMT
పోల‌వ‌రంపై సుప్రీంకోర్టులో ఏం జ‌రిగిందంటే..
X
తెలుగు రాష్ర్టాల‌కు సంబంధించి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో కీల‌క ప‌రిణామం ఒక‌టి చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన కేసులో తమకు కూడా అవకాశం కల్పించాలని తెలంగాణ - ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వాలు ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ లపై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఏపీ స‌ర్కారు త‌ర‌ఫున న్యాయ‌వాది త‌న వాద‌న‌లు వినిపిస్తూ...విభజన చట్టంలోని సెక్షన్‌ 90 ప్రకారం తెలంగాణకు ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని విచారణలో భాగంగా సుప్రీం కోర్టుకు తెలిపారు. తెలంగాణ పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం తెలిపిన అభ్యంతరాలను జస్టిస్‌ మదన్‌ బీ.లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా ధర్మాసనం నమోదు చేసింది. అయితే, కేసు విచారణ సందర్భంలో అభ్యంతరాలను తెలిపేందుకు కోర్టుకు స్వేచ్ఛనిచ్చింది ధర్మాసనం. దీంతో సుప్రీం కోర్టు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ఇంప్లీడ్‌ పిటిషన్లను విచారణకు స్వీకరించింది. అయితే, కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పకపోవడంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై కేంద్రానికి రూ.25వేలు జరిమానా విధించింది, దీంతో జరిమానా ఉప సంహరించాలన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై రెండు వారాల్లో సమాధానం తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలు వాయిదా వేస్తూ సర్వోన్నత న్యాయ స్థానం తీర్పునిచ్చింది.