Begin typing your search above and press return to search.

ట‌పాసుల కాల్చుడుపై సుప్రీం సంచ‌ల‌న తీర్పు!

By:  Tupaki Desk   |   23 Oct 2018 7:35 AM GMT
ట‌పాసుల కాల్చుడుపై సుప్రీం సంచ‌ల‌న తీర్పు!
X
ఈ మ‌ధ్య‌న సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ వైర‌ల్ అయ్యింది. దాని సారాంశం చెప్పుకున్నాక‌.. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోకి వెళితే బాగుంటుంది. ఇంత‌కీ వైర‌ల్ అయిన ఆ పోస్టులో చెప్పేదేమంటే.. సంక్రాంతి పండ‌క్కి భోగి రోజున భోగి మంట‌లు వేస్తే చెట్లు న‌రికేస్తున్నారు.. ప‌ర్యావ‌ర‌ణానికి చేటు చేస్తారంటారు. సంక్రాంతి సంద‌ర్భంగా కోడి పందేలు పెట్టుకుంటామంటే జీవహింస అంటారు.. స‌ర్లే అని హోలీకి రంగులోసుకుంటామంటే అలెర్జీ.. పాడు రంగులు వ‌ద్దంటారు. స‌ర్లేన‌ని ఊరుకుందామ‌న్నంత‌లో వ‌చ్చే శ్రీ‌రామ‌న‌వ‌మికి అంతేసి పందిళ్లు వేసి.. ఇంత ఖ‌ర్చు హ‌డావుడి అవ‌స‌ర‌మా? ప్ర‌శ్నిస్తారు.

వినాయ‌క చ‌వితి గురించి చెప్పే అవ‌స‌ర‌మే లేదు. మ‌ట్టి వినాయ‌కుడి మీద ఉద్య‌మ స్ఫూర్తితో సాగుతున్న వైనం రానున్న రోజుల్లో పూజ మీద ప‌త్రి మీద ప‌డ‌టం ఖాయం.. దీని త‌ర్వాత వ‌చ్చే దీపావ‌ళికి పిల్ల‌లు స‌ర‌దా ప‌డి ఒక్క‌రోజు కాల్చే ట‌పాసుల కార‌ణంగా ప‌ర్యావ‌ర‌ణం మొత్తం ఆగంమాగం అవుతుందంటారు. ఇలా చేస్తే.. హిందువులు ఏం పండ‌గ చేసుకోవాలి? అంటూ స‌ద‌రు పోస్టు ముగుస్తుంది.

దీన్ని ప‌క్క‌న పెట్టేద్దాం. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూద్దాం. దీపావ‌ళి సంద‌ర్భంగా అమ్మే ట‌పాసుల‌పై బ్యాన్ విధించాల‌ని.. కాల్చ‌కుండా అడ్డుకోవాల‌ని.. ప‌ర్యావ‌ర‌ణాన్ని రక్షించాలంటే ద‌రిద్ర‌పు దీపావ‌ళి పండ‌క్కి ట‌పాసులు కాల్చాలా? ఏంటి అంటూ ప్ర‌శ్నిస్తూ వేసిన పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపిన అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది.

ట‌పాసుల అమ్మ‌కాల‌పై బ్యాన్ విధించ‌లేం కానీ.. అమ్మ‌కాల మీద కొన్ని ప‌రిమితులు.. ట‌పాసులు కాల్చే విష‌యంలోనూ కొన్ని ప‌రిమితుల్ని విధిస్తూ తాజాగా తీర్పును ఇచ్చింది. ఇక.. దీపావ‌ళి పండ‌గ రోజున కేవ‌లం రెండు గంట‌లు మాత్ర‌మే ట‌పాసులు కాల్చాల‌ని సుప్రీం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

అదే స‌మ‌యంలో ఈ కామ‌ర్స్ వెబ్ సైట్ల ద్వారా ట‌పాసుల అమ్మ‌కాల‌పై నిషేధం విధించింది. ట‌పాసుల్ని కాల్చ‌టం ద్వారా ప‌ర్యావ‌ర‌ణం దారుణంగా దెబ్బ తింటుంద‌న్న ఆందోళ‌న‌ల్ని వ్య‌క్తం చేస్తూ కొంద‌రు ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు సుప్రీంను ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో పిటిష‌న్ల‌ను విచారించిన న్యాయ‌స్థానం.. ట‌పాసుల అమ్మ‌కాల్ని బ్యాన్ చేయ‌టం కుద‌ర‌ద‌ని.. కాకుంటే ప‌రిమితులు విధిస్తామంటూ ఎంచ‌క్కా గొప్ప ప‌రిమితుల్ని విధించింది.

దీని ప్ర‌కారం త‌క్కువ సౌండ్ వ‌చ్చే ట‌పాసుల్ని విక్ర‌యించాల‌ని.. ఉద్గారాలు సైతం త‌క్కువ‌గా విడుద‌ల‌య్యేలా బాణ‌సంచా త‌యారు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్నింటికి మించి రెండు గంట‌ల స‌మ‌య‌మే బాణ‌సంచా కాల్చ‌టానికి అనుమ‌తి ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. సో..ఈసారి దీపావ‌ళికి ఇంట్లో అంతా కలిసి కాల్చొచ్చు..కానీ.. స‌ర్కారు చెప్పిన రెండు గంట‌ల్లోనే కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయాలి. లేదంటే.. విజిల్ ఊదుతూ పోలీసులు కేసులు పెడ‌తారో ఏమో? అంత‌కాడికి పండ‌గే చేసుకోవ‌ద్దంటే బాగుంటుందేమో?

దీపావ‌ళి సంద‌ర్భంగా కాల్చే ట‌పాసుల కార‌ణంగా భారీగా ప‌ర్యావ‌ర‌ణ హ‌న‌నం జ‌రుగుతుందంటే.. రోజూ తినే నాన్ వెజ్ కార‌ణంగా అంత‌కు వంద‌ల రెట్లు ఎక్కువ కాలుష్యం జంతువుల ఎముక‌ల కార‌ణంగా.. భారీ ప‌రిశ్ర‌మ‌లతోనూ విడుద‌ల‌వుతూ ఉంటుంది. మ‌రి.. వీటి మీద ఉండ‌ని నియంత్ర‌ణ‌..ప్ర‌జ‌లు చేసుకునే పండ‌గ మీద‌నే ఎందుకో?