Begin typing your search above and press return to search.

అధార్‌ లేకున్నా అర్హుడే

By:  Tupaki Desk   |   17 March 2015 4:43 AM GMT
అధార్‌ లేకున్నా అర్హుడే
X
ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పొందాలన్నా ఆధార్‌ అన్నది తప్పనిసరిగా చేయటం ఈ మధ్య కనిపిస్తోంది. ఆధార్‌ ఉన్నోడి సంగతి ఓకే. మరి.. అది లేని వాడి పరిస్థితి ఏంటి? ఆధార్‌ లేకుంటే సంక్షేమ కార్యక్రమాలకు అర్హత ఉండదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఆధార్‌కార్డు లేనంత మాత్రాన ప్రభుత్వ పథకాలకు అనర్హుడిగా ఉండకూడదని సుప్రీంకోర్టు తాజాగా తేల్చేసింది. ఇదే అంశానికి సంబందించి గతంలో తాను చెప్పిన మాటను పునుద్ఘాటించింది.

ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని గతంలోనే సుప్రీం తేల్చింది. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని చెప్పిన సుప్రీంకోర్టు.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. ''మీకు ఎలాంటి సాకులకు అవకాశం లేదు. మేం గతంలో జారీ చేసిన ఆదేశాల్ని పాటించాల్సిందే'' అని తేల్చేసింది.

వివాహ రిజిస్ట్రేషన్ల మొదలు.. జీతాలకు.. పీఎఫ్‌ పంపిణీకి.. ఆస్తుల రిజిస్ట్రేషన్ల వద్ద ఆధార్‌ తప్పనిసరి చేయటాన్ని తప్పు పట్టింది. ఆధార్‌ లేనంత మాత్రాన ప్రభుత్వ పథకాలకు దూరం కావటం సరికాదని 2013లో తాను చెప్పిన తీర్పును మరోసారి స్పష్టం చేసింది. ఆధార్‌ తప్పనిసరి కాదన్న తమ ఆదేశాలను కేంద్రం పట్టించుకోకపోవటంపై జులైలో విచారణ చేపట్టాలని తేల్చింది. తాజా వ్యాఖ్యలతో సుప్రీం తేల్చిన అంశం ఏమిటంటే.. ఆధార్‌ లేకున్నా ప్రభుత్వ పథకాలకు ప్రతిఒక్కరూ అర్హులే అన్న విషయం.