Begin typing your search above and press return to search.

ర‌ద్దైన పెద్ద‌నోట్ల‌ను మార్చుకునేందుకు మ‌రో ఛాన్స్‌

By:  Tupaki Desk   |   4 July 2017 8:20 AM GMT
ర‌ద్దైన పెద్ద‌నోట్ల‌ను మార్చుకునేందుకు మ‌రో ఛాన్స్‌
X
ర‌ద్దైన పాత నోట్లు మీ ద‌గ్గ‌ర ఉన్నాయా? వాటిని మార్చుకోవ‌టానికి వీల్లేని ప‌రిస్థితుల్లో అవి మీ ద‌గ్గ‌ర ఉన్నాయా? అట్ల‌యితే మీకిది క‌చ్ఛితంగా శుభవార్తే. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసి.. వాటిని మార్చుకునేందుకు ప్ర‌భుత్వం స‌మ‌యం ఇచ్చిన త‌ర్వాత కూడా వాటిని మార్చుకోలేని వారి ప‌రిస్థితి ఏమిటి? అవి చిత్తు కాగితాలుగా ఉండిపోవాల్సిందేనా? అన్న సందేహాలకు చెక్ పెడుతూ.. సుప్రీంకోర్టు తాజాగా కీల‌క వ్యాఖ్య చేసింది.

ర‌ద్దైన పెద్ద‌నోట్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కూ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోని వారికి ఊర‌ట‌నిస్తూ.. పాత నోట్ల‌ను మ‌రోసారి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవ‌టానికి వీలుగా ఒక అవ‌కాశాన్ని ప్ర‌జ‌ల‌కు ఇవ్వాలంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని.. రిజ‌ర్వ్ బ్యాంకును ఆదేశించింది. స‌హేతుక కార‌ణాలు చూపించే వారికి ఈ వెసులుబాటు ఇవ్వాల‌ని వెల్ల‌డించింది.

త‌గిన కార‌ణాలు చూపించే ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్టొద్ద‌ని పేర్కొంది. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో.. ఈ ఉదంతంపై సుప్రీంలో దాఖ‌లైన ఒక ప్ర‌జాప్ర‌యోజ‌న వాజ్యంపై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

న‌వంబ‌రు 8న పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న హ‌టాత్తు నిర్ణ‌యం కార‌ణంగా కొంద‌రు గ‌డువు లోప‌ల వాటిని మార్చుకోలేక‌పోయారు. ఇలాంటి వారి సంగ‌తేమిటంటూ కోర్టును ఆశ్ర‌యించ‌గా.. దీనిపై అత్యున్న‌త న్యాయ‌స్థానం సానుకూలంగా స్పందించింది. ఇదిలా ఉంటే.. గ‌డువు తీరిన త‌ర్వాత పెద్ద‌నోట్ల‌ను ఉంచుకున్న వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కేంద్రంప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. సుప్రీం ఇచ్చిన తాజా ఆదేశాలు పాత నోట్లు ఉన్న వారికి తీపి వార్త‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే.. దీనిపై కేంద్రం త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌టానికి నాలుగు వారాల స‌మ‌యాన్ని సుప్రీం ఇచ్చింది. మ‌రి.. దీనికి మోడీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/