Begin typing your search above and press return to search.

కార్లు, బైకుల కంపెనీల‌కు సుప్రీం షాక్‌

By:  Tupaki Desk   |   29 March 2017 4:59 PM GMT
కార్లు, బైకుల కంపెనీల‌కు సుప్రీం షాక్‌
X
వాహన తయారీదారులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బీఎస్‌-త్రీ ప్రమాణాలతో తయారైన వాహనాల నిషేధంపై స్టే విధించాలన్న వాహన తయారీదారుల పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వ్యాపారం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-త్రీ వాహనాల అమ్మకంపై నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది.

త‌మ ద‌గ్గ‌ర అమ్ముడుపోని బీఎస్ III వాహ‌నాలు 8 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నాయ‌ని, వాటిపై నిషేధం విధించ‌వ‌ద్ద‌న్న త‌యారీదారుల అభ్య‌ర్థ‌నను గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌న్నించింది. ఏప్రిల్ 1 డెడ్‌లైన్ త‌యారీకేగానీ, రిజిస్ట్రేష‌న్‌కు కాకూడ‌ద‌ని వాళ్లు ప్ర‌భుత్వాన్ని కోరారు. 2005, 2010ల‌లో కొత్త టెక్నాల‌జీని ప్ర‌వేశపెట్టిన‌పుడు త‌మ పాత స్టాక్స్‌ను అమ్ముకోడానికి వీలు క‌ల్పించార‌ని కూడా కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు మాత్రం వాళ్ల వాద‌న‌ను తోసిపుచ్చింది. బీఎస్ IV వాహ‌నాలు ఇంత‌కుముందు వాటి కంటే చాలా 80 శాతం త‌క్కువ ఉద్గారాల‌ను వెలువ‌రిస్తాయ‌న్న ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్ష‌న్ కంట్రోల్ అథారిటీ నివేదిక ప్ర‌కారం సుప్రీం ఈ తీర్పు వెలువ‌రించింది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్ IV ప్ర‌మాణాలు పాటించ‌ని వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ నిలిపేయాల‌ని జ‌స్టిస్ మ‌ద‌న్ బీ లోకూర్‌, జ‌స్టిస్ దీప‌క్ గుప్తాల‌తో కూడిన ధర్మాస‌నం స్ప‌ష్టంచేసింది.

కాగా, త‌యారీదారుల ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం ఇంకా 8,24,275 బీఎస్ III వాహ‌నాలు ఉన్న‌ట్లు సోసైటీ ఆఫ్ ఇండియ‌న్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చ‌ర‌ర్స్ ఓ నివేదిక స‌మర్పించింది. వీటిల్లో 96 వేలు కమర్షియల్‌ వెహికిల్స్‌, 6 లక్షల టూవీలర్స్‌, 40 వేల త్రీ వీలర్స్‌ ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందని అంచనా. వీటిని అమ్ముకునే వరకైనా గడువు పొడిగించాలని వాహన తయారీదారులు కోరుతున్నారు. ప్రస్తుతం దేశంలో బీఎస్-4 ప్రమాణాలతో తయారైన వాహనాలనే ఉత్పత్తి చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/