Begin typing your search above and press return to search.

మోడీ వ్యూహానికి సుప్రీం కోర్టు చెక్‌

By:  Tupaki Desk   |   17 July 2021 9:30 AM GMT
మోడీ వ్యూహానికి సుప్రీం కోర్టు చెక్‌
X
అధికారం కోసం రాజ‌కీయ పార్టీలు ఎంత‌కైనా తెగిస్తాయ‌నే సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తాయి. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఎలాంటి క‌ఠిన నిర్ణ‌యాలైనా తీసుకుంటాయి. తాజాగా యూపీ ఎన్నిక‌ల్లో హిందువుల ఓట్ల కోసం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్‌, ప్ర‌ధాని మోడీ క‌లిసి ప‌న్నిన ఓ వ్యూహానికి సుప్రీం కోర్టు చెక్ పెట్టింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అస‌లు విష‌యంలోకి వెళ్తే..

ఇప్ప‌టికే కుంభ‌మేళా పేరుతో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి కేంద్ర ప్ర‌భుత్వ ప‌రోక్ష కార‌ణంగా నిలిచింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీనికి యూపీ, ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వాలు సాయ ప‌డ్డాయ‌ని అంటున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్ర‌భావం త‌గ్గుతోంది. కానీ మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న నిపుణుల మాట‌లు భ‌య‌పెడుతున్నాయి. ఈ స‌మ‌యంలో కావ‌డ్ యాత్ర పేరుతో మ‌రోసారి ఇలాంటి త‌ప్పే చేసేందుకు నేత‌లు సిద్ధ‌మ‌య్యారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం యాత్ర‌కు అనుమ‌తిస్తే ఉత్త‌రాఖండ్ త‌ప్పు తెలుసుకుని త‌ప్పుకుంది. యాత్ర పేరుతో ప్ర‌జ‌ల ప్రాణాలు పోవ‌డానికి దేవుడు కూడా ఇష్ట‌ప‌డ‌డు అని ఉత్త‌రాఖండ్ కొత్త ముఖ్య‌మంత్రి పుష్క‌ర్‌సింగ్ చేసిన వ్యాఖ్య‌లు వాస్త‌వ ప‌రిస్థితికి అద్దం ప‌ట్టేలా ఉన్నాయి. కానీ యూపీలోని యోగీ ప్ర‌భుత్వం మాత్రం క‌రోనా నిబంధ‌న‌ల మ‌ధ్య సుర‌క్షితంగా యాత్ర చేప‌డ‌తామ‌ని చెప్ప‌డంతో ఈ విష‌యంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. యాత్ర‌ను మీరు ర‌ద్దు చేస్తారా? లేదా మ‌మ్మ‌ల్నే ర‌ద్దు చేయ‌మంటారా? అని హుకూం జారీ చేసింది. దీంతో ఆ యాత్ర జ‌ర‌గ‌ద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది.

ఇప్పుడు సుప్రీం కోర్టు సీరియ‌స్ అవ‌డంతో కేవ‌లం ఓట్ల కోస‌మే ఆలోచించే కేంద్ర‌, యూపీ ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు మొద‌లయ్యాయి. లాక్‌డౌన్ ఎత్తేశాక దేశంలో ప్ర‌జ‌ల విచ్చ‌ల‌విడిగా బ‌య‌ట తిరుతున్నార‌ని, మూడో వేవ్‌కు వీళ్లు కార‌ణ‌మ‌వుతార‌ని ఓ వైపు మొస‌లి క‌న్నీరు కార్చిన మోడీ.. మ‌రోవైపు కావ‌డ్ యాత్ర‌కు యూపీ ప్ర‌భుత్వం అనుమ‌తిస్తే ఏం చేశార‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. సీఎం యోగీకి చెప్పి యాత్ర‌ను ఆపించేలా ముందే నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు క‌దా అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

కానీ ఇక్క‌డ అస‌లు విష‌యం వేరే ఉంద‌ని రాజ‌కీయ వేత్త‌లు అంటున్నారు. వ‌చ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లున్నాయి. అక్క‌డ హిందువుల ఓట్లు మొత్తం బీజేపీకే ప‌డాలి. అందుకే ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ ఇలాంటి యాత్ర‌ల‌కు యోగీతో అనుమ‌తి ఇచ్చేలా కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. ఇప్పుడు యాత్ర‌ను ర‌ద్దుచేసిన పాపం మాత్రం సుప్రీం కోర్టుదే అన్నట్లు చూపిస్తారు. యాత్ర కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించింద‌ని, కానీ సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేందుకు ఈ నాట‌క‌మ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే ఈ విష‌యం తెలుసుకోలేనంత అమాయాకులేం కాదు ప్ర‌జ‌లు. ఇప్ప‌టికే యూపీలో కాషాయ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. స్థానిక ఎన్నిక‌ల్లో అది స్ప‌ష్ట‌మైంది. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ఇదే ఫ‌లితం పున‌రావృతం కాబోతుంద‌నే అంచ‌నాలున్నాయి.