Begin typing your search above and press return to search.

మూడు కీలక కేసుల్లో తీర్పు వెల్లడించిన సుప్రీం .. ఏం చెప్పిందంటే ?

By:  Tupaki Desk   |   14 Nov 2019 10:52 AM GMT
మూడు కీలక కేసుల్లో తీర్పు వెల్లడించిన సుప్రీం .. ఏం చెప్పిందంటే ?
X
దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ..తాజాగా అయోధ్య వివాదాస్పదమైన స్థలం విషయం లో తుది తీర్పు ని వెల్లడించిన విషయం తెలిసిందే. దేశం లోనే అత్యంత సున్నితమైన , అత్యంత క్లిష్టమైన సమస్య గా భావించే ..ఈ కేసు లో సుప్రీం తుది తీర్పు ని వెల్లడించింది. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ .. ఈ నెల 17 వ తేదీన రిటైర్ అవుతున్నారు. దీంతో..ఆయన తన బాధ్యతల నుండి రిలీవ్ అవ్వటానికి ముందు గానే పరిష్కారానికి సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న అంశాల మీద ఫోకస్ చేసారు. ఇక, ఈ ఒక్క రోజే మూడు కేసుల్లో తీర్పు చెప్పారు.

రఫేల్ డీల్ :

అవేంటి అంటే ..మొదటిది రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసు , శబరిమల అయ్యప్ప ఆలయం లోకి మహిళల ప్రవేశం , రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన నేడు తీర్పుని వెల్లడించింది. ముందుగా రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కేసు గురించి చూస్తే .. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పై క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్ల ను సుప్రీం కోర్టు ఇవాళ కొట్టివేసింది. కోర్టు పర్యవేక్షణ లో రఫేల్ అంశం పై విచారణ అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్పు సమీక్షించాంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా. అరుణ్‌శౌరి, లాయర్ ప్రశాంత్‌భూషణ్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ వేర్వేరుగా సుప్రీం ను ఆశ్రయించారు. ఈ వాదనల తర్వాత సమీక్ష కు సుప్రీం అంగీకరించింది. తాజాగా, తీర్పు వెలువరించిన ధర్మాసనం.. వీటిని కొట్టివేసింది.

శబరిమల తీర్పు :

శబరిమల అయ్యప్ప ఆలయం లోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశం నిషేధాన్ని 1991లో కేరళ హై కోర్టు చట్ట బద్దం చేసింది. అయితే, కేరళ హైకోర్టు తీర్పు ను ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోషియేషన్‌ 2006 లో సుప్రీం కోర్టు లో సవాల్‌ చేసింది. దానిపై విచారించిన సుప్రీం కోర్టు.. 2018 సెప్టెంబరు 28న తీర్పును వెలువరించింది. ఆ సమయంలో అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పు తో కేరళ సహా దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆలయం లోకి ప్రవేశించడానికి మహిళలు చేసిన ప్రయత్నాలను అయ్యప్ప భక్తులు తీవ్రంగా ప్రతి ఘటించారు. కేరళ ప్రభుత్వ చర్యలను కూడా భక్తులు తీవ్రం గా వ్యతిరేకించారు. తీర్పును పునః సమీక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో సుప్రీంకోర్టు రివ్వూ పిటిషన్లకు అనుమతించింది. మొత్తం 64 మంది వేర్వేరుగా రివ్వూ పిటిషన్లు దాఖలు చేయగా ఫిబ్రవరి 6 వాదనలు ముగిసాయి. గురువారం ఈ పిటిషన్ల పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ను వెల్లడించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ.. శబరిమల తీర్పు రివ్యూ తో పాటు అనే పిటిషన్లు మా ముందుకు వచ్చాయని చెప్పారు. ప్రతీ ఒక్కరికి మత స్వేచ్ఛ ఉందని, మతంలో అంతర్గత విషయం ఏంటనేది తేల్చడమే తమ ముందున్న పని అని ఆయన అన్నారు. దీనికోసం తీర్పును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని తెలిపారు.

రాహుల్ వ్యాఖ్యలు ..

ఇక రాహుల్‌ పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో రాహుల్ చెప్పిన క్షమాపణలను ఆమోదించింది. రఫెల్ కు సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా 'చౌకీదార్ చోర్ హై' అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల పై కోర్టు మందలించింది. మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటూ రాహుల్‌ గాంధీని సున్నితంగా మందలించింది. ఈ కేసులో రాహుల్ గాంధీ పెట్టుకున్న క్షమాపణను అంగీకరించింది. రాహుల్‌ పై దాఖలైన పిటిషన్‌ పై విచారణ అవసరం లేదని తెలుపుతూ కొట్టేసింది.