Begin typing your search above and press return to search.

కర్ణాటకకు ‘కావేరీ’ లెక్క ఫైనల్ చేసిన సుప్రీం

By:  Tupaki Desk   |   19 Oct 2016 10:36 AM IST
కర్ణాటకకు ‘కావేరీ’ లెక్క ఫైనల్ చేసిన సుప్రీం
X
కర్ణాటక – తమిళనాడుల మధ్య కావేరీ జలాల వివాదం ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో హైటెన్షన్ నెలకొనేలా చేసిన కావేరీ జలాల వివాదానికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల్ని జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై కర్ణాటక ప్రభుత్వానికి విస్పష్ట సూచన చేసింది. రెండు రాష్ట్రాల్లో శాంతి పరిరక్షణకు కృషి చేయాలని చెప్పిన సుప్రీం.. తమిళనాడుకు విడుదల చేయాల్సిన కావేరీ జలాల లెక్కను సుప్రీం పేర్కొంది.

మరోసారి తమ ఆదేశాలు విడుదలయ్యే వరకూ.. ప్రతిరోజు తమిళనాడుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించింది. వాస్తవానికి ఈ తరహా ఉత్తర్వులను సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చింది. అయితే.. దీనిపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో.. కావేరీ జలాలపై కర్ణాటక.. తమిళనాడు..కేరళ.. పుదుచ్చేరిలు అప్పీళ్లు దాఖలు చేశాయి.

వీటికి సంబంధించిన విచారణ ఎంతవరకన్న విషయంపై దృష్టి సారించి సమ న్యాయం చేస్తామని ప్రకటించిన సుప్రీంకోర్టు.. అక్టోబరు 4న తామిచ్చిన ఆదేశాల్ని కర్ణాటక సర్కారు అమలు చేయాలని తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. తాజాగా త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తమిళనాడుకు రోజూ 2 వేల క్యూసెక్కుల కావేరీ జలాల్ని విడుదల చేయాల్సి ఉంటుంది. తమ జలశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని వాదిస్తున్న కర్ణాటక ప్రభుత్వం.. సుప్రీం తాజా ఆదేశాలపై ఎలా రియాక్ట్ కానుందన్నది ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/