Begin typing your search above and press return to search.

టెల్కోలకు దిమ్మ తిరిగే షాకిచ్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   17 Jan 2020 4:19 AM GMT
టెల్కోలకు దిమ్మ తిరిగే షాకిచ్చిన సుప్రీం
X
‘‘ఏజీఆర్’’ అన్న ఒక్క పదం దేశంలోని టెలి కంపెనీలకు శరాఘాతంగా మారటమే కాదు.. చాలా కంపెనీలు టెలికం వ్యాపారం నుంచి నిష్క్రమించే పరిస్థితులకు తెర తీస్తున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఏజీఆర్ అంటే ఏమిటంటారా? అచ్చ తెలుగులో చెప్పాలంటే సవరించిన స్థూల ఆదాయం అని చెప్పొచ్చు. ఇంతకీ.. ఈ పదానికి టెలికం కంపెనీలకున్న లింకేమిటి? ఆ పదం టెలికం కంపెనీలకు ఎందుకని షాకింగ్ గా మారింది? సుప్రీంకోర్టు తాజాగా ఏం చెప్పింది? సుప్రీం చెప్పిన దాని ప్రకారమే జరిగే రానున్న రోజుల్లో ఏమవుతుంది? అన్నది చూస్తే..

టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు.. స్పెక్ట్రం యూసేజీ ఛార్జిలను మదింపు చేసేందుకు ఉద్దేశించిందే ఏజీఆర్. దీని కింద టెలికంయేతర ఆదాయాల్ని కూడా కలపటంతో అసలు సమస్యగా మారింది. సుప్రీం చెప్పిన దాని ప్రకారం లెక్కలోకి తీసుకుంటే.. టెలికం కంపెనీలు కేంద్రానికి ఏకంగా రూ.1.47 లక్షల కోట్లను కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే నష్టాలతో కిందామీదా పడుతున్న టెలికం కంపెనీలు ఇంత భారీ మొత్తాన్ని జనవరి 23లోపు కట్టటం సాధ్యం కాదు. కట్టాల్సిందేనని కత్తి కంపెనీల మెడ మీద పెడితే.. చేతులు ఎత్తేయటం మినహా మరొకటి ఉండదు. అదే జరిగితే.. ఇప్పుడు కనిపిస్తున్న చాలా టెలి కంపెనీల అడ్రస్ చిరిగిపోవటం ఖాయం.

సుప్రీం ఆదేశాల ప్రకారం కేంద్రానికి టెలికం కంపెనీలు కట్టాల్సిన భారీ మొత్తం గుదిబండగా మారి.. ఆయా కంపెనీ ఫ్యూచర్ గందరగోళంలో పడిన పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే టెల్కోలు కట్టాల్సిన దాని నుంచి మినహాయింపుల్ని కేంద్రం ప్రకటించాల్సి ఉంటుంది. అది మినహా మరో మార్గం లేదు. అయితే.. అలాంటి సంకేతాలేవీ మోడీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు కనిపించని పరిస్థితి.

మరోవైపు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చూస్తే.. టెల్కోలు కట్టాల్సిన భారీ మొత్తాన్ని కట్టక తప్పదన్న విషయాన్ని తేల్చేసిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా బాకీనే రూ.53,038 కోట్లు.. భారతీ ఎయిర్ టెల్ బకాయిలు రూ.35,586 కోట్లుగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కంపెనీలు ఇంత భారీ మొత్తాల్ని కట్టే పరిస్థితి ఏ మాత్రం లేదని చెప్పక తప్పదు. మరి.. బాకీ చెల్లించాలని పట్టుబడితే.. కంపెనీలు మూతపెట్టటం మినహా మరో మార్గం లేదు. అదే జరిగితే దేశంలో రెండు భారీ టెలికంకంపెనీలు మినహా మిగిలినవన్ని ఇంటి దారి పట్టక తప్పదు. అదే జరిగితే.. వారు చెప్పినంత ఛార్జీలు రానున్న రోజుల్లో కట్టాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఇంతకాలం కారుచౌకతో డేటాను.. కాల్ ఛార్జీలతో చేసిన ఎంజాయ్ రానున్న రోజుల్లో భారంగా మారటం ఖాయం.