Begin typing your search above and press return to search.

పూజ కోసం పిటిషన్ వేస్తే.. సుప్రీంకు కోపమొచ్చింది

By:  Tupaki Desk   |   13 April 2019 5:12 AM GMT
పూజ కోసం పిటిషన్ వేస్తే.. సుప్రీంకు కోపమొచ్చింది
X
పూజ కోసం అనుమతి అడిగిన పిటిషనర్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూజ చేసుకోవటానికి అనుమతి అడగటానికి సుప్రీంకోర్టుకు వెళ్లటం ఏంటి? దానికి సుప్రీంకోర్టు ఫైర్ కావటం ఏమిటన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. మరి.. అడిగిన వ్యక్తి.. తన ఇంట్లోనో.. తన ఊళ్లోనో పూజ కోసం అనుమతి అడగలేదు. వివాదాస్పద ప్రాంతమైన రామజన్మభూమి.. బాబ్రీమసీదు అంటూ ఒక పట్టాన తేలని ప్రాంతం ఉంది కదా?

అక్కడ పూజలు చేసుకోవటానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో.. అగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఏం.. దేశాన్ని ప్రశాంతంగా ఉంచాలనుకోవటం లేదా? అంటూ సూటిగా ప్రశ్నిస్తూ కన్నెర్ర చేసింది. ఇంతకీ ఈ పిటిషన్ వేసిన పెద్ద మనిషి ఎవరో కాదు.. రామజన్మ భూమి మందిర్ నిర్మాణ్ న్యాస్ సంస్థలో పెద్ద తలకాయ అయిన అమర్ నాథ్ మిశ్రా.

ఇతగాడు సుప్రీంను ఆశ్రయించటం వెనుక వేరే కథ ఉంది. గతంలో ఇదే రీతిలో పిటిషన్ దాఖలు చేయగా.. అలహాబాద్ హైకోర్టు ఫైన్ విధించింది. దాన్ని కట్టేందుకు నిరాకరించిన ఆయన.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ విముఖత వ్యక్తం చేస్తూ.. వివాదాస్పద ప్రాంతంలో ఎలాంటి పూజలు కానీ.. సాంస్కృతిక కార్యక్రమాల్నినిర్వహించకూడదని తేల్చింది.

అదే సమయంలో అలహాబాద్ హైకోర్టు పేర్కొన్న విధంగా.. వివాదం నెలకొన్న 67.7 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి పూజలు చేయకూడదన్న.. తమ నిర్ణయాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వారికి రూ.5లక్షల జరిమానా విధించాలన్న నిర్ణయాన్ని స్వాగతించింది. అయోధ్య వివాదంపై ఈ మధ్యనే సుప్రీం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇందులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ ఎం ఇబ్రహీం కలిపుల్లా నేతృత్వం వహిస్తుండగా.. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్.. సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచుత సభ్యులుగా ఉన్నారు. వీరు మే 3 నాటికి ఈ వివాదానికి ఉన్న పరిష్కార మార్గాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వేళలో పూజకోసం పిటిషన్ వేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.