Begin typing your search above and press return to search.

తాజ్ గురించీ సుప్రీమే చెప్పాలా మోడీజీ?

By:  Tupaki Desk   |   2 May 2018 6:28 AM GMT
తాజ్ గురించీ సుప్రీమే చెప్పాలా మోడీజీ?
X
ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన క‌ట్ట‌డాలు దేశంలో ఎన్ని? అంటే.. చాలానే చెబుతారు. కానీ.. ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించేది మాత్రం తాజ్ మ‌హాల్ మాత్ర‌మే. ఇప్పుడంటే చాలా దేశాలకు భార‌త్ అంటే తెలిసింది కానీ.. పాతికేళ్ల క్రితం మ‌న ఇరుగున ఉండే జ‌పాన్ లాంటి దేశంలోనూ ఇండియా అంటే పాములు ప‌ట్టుకునే వారు.. కోతుల్ని ఆడించే వార‌న్న భావ‌న ఉంది. మ‌న పాల‌కుల పుణ్య‌మా అని.. దేశం ఎప్పుడో అభివృద్ధి చెందాల్సి ఉన్నా.. చెంద‌ని ప‌రిస్థితి.

దేశంలోని రాజ‌కీయ నాయ‌కుల ఆస్తులు వంద‌ల రెట్లు పెర‌గ‌ట‌మే కానీ.. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణం మాత్రం పెర‌గ‌ని దుస్థితి. ఎందుకిలా అంటే.. పాల‌కుల్లో ప్ర‌జ‌ల ప‌ట్ల ప్రేమాభిమానాలు లేక‌పోవ‌ట‌మే. ప్ర‌జాసేవ కోసం వ‌చ్చిన తాము ప్ర‌జ‌ల కోసం.. దేశం కోసం ఎంతోకొంత చేయాల‌న్న భావ‌న వారిలో పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవ‌టం భార‌తీయులు చేసుకున్న పాపంగా చెప్పాలి.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన క‌ట్ట‌డాల విష‌యంలో పాల‌కుల తీరు ఎలా ఉంటుందో తాజాగా సుప్రీంకోర్టు మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. నిత్యం నీతులు చెప్పే ప్ర‌ధాని మోడీ హ‌యాంలోనూ ప‌రిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేద‌ని చెప్పాలి. గ‌తంలో నోరు విప్ప‌ని నేత ప్ర‌ధానిగా ఉన్నార‌న్న ఫీలింగ్ మోడీ మార్చారు. అయితే.. ఇప్పుడు దేశ ప్ర‌జ‌లు ఆయ‌న్నుకాస్త మాట‌లు ఆపి.. ప‌నుల మీద దృష్టి పెట్టాలంటున్న ప‌రిస్థితి.

తాజాగా తాజ్ మ‌హాల్ క‌ట్ట‌డం రంగు మార‌టంపై సుప్రీం తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. గ‌తంలో ప‌సుపుప‌చ్చ‌గా మారిన ఈ క‌ట్ట‌డం.. త‌ర్వాత కాలంలో కొంచెం గోధుమ వ‌ర్ణంలోకి ఇప్పుడు ఆకుప‌చ్చ రంగులోకి మార‌టంపై ధ‌ర్మాస‌నం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.

విదేశీ నిపుణుల సాయం తీసుకొని అయినా తాజ్ కు జ‌రిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేసి.. దాన్ని ప‌రిర‌క్షించాల‌ని కోరింది. దేశ సంప‌ద‌ను జాగ్ర‌త్త‌గా కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వానిది కాదా? మ‌రి.. ప్ర‌భుత్వం చేయాల్సిన బాధ్య‌త‌ను సైతం కోర్టులు గుర్తు చేయాల్సి రావ‌టం చూస్తే.. మొన‌గాడిగా చెప్పే మోడీ పాల‌న‌లోని లోపం ఎంత‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది.