Begin typing your search above and press return to search.

సుప్రీం సంచ‌ల‌నం: బ‌ల‌ప‌రీక్ష శ‌నివార‌మే!

By:  Tupaki Desk   |   18 May 2018 6:26 AM GMT
సుప్రీం సంచ‌ల‌నం: బ‌ల‌ప‌రీక్ష శ‌నివార‌మే!
X
క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క రాజ‌కీయ ప‌రిణామాల‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. విశ్వాస ప‌రీక్ష‌ను శ‌నివార‌మే నిర్వ‌హించాల‌ని వెల్ల‌డించింది. దీంతో.. క‌ర్ణాట‌క రాజ‌కీయం కీల‌క మ‌లుపు తిరిగిన‌ట్లైంది.

గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం మేర‌కు య‌డ్యూర‌ప్ప స‌ర్కారు నిన్న (శుక్ర‌వారం) కొలువు తీరిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌.. జేడీఎస్ ప‌క్షాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. మ‌రోవైపు.. య‌డ్డీ స‌ర్కారును ప‌దిహేను రోజుల్లోపు బ‌ల‌ప‌రీక్ష నిరూపించుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోరారు.

ఇదిలా ఉండ‌గా.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన కాంగ్రెస్‌.. జేడీఎస్ పిటిష‌న్ల‌పై ఈ రోజు ఉద‌యం విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క అసెంబ్లీలో య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వం బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కోవ‌టానికి త‌మ‌కు మ‌రికొంత స‌మ‌యం కావాలంటూ బీజేపీ చేసిన విన‌తిని సుప్రీం తిర‌స్క‌రించింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది.

ఆటార్నీ జ‌న‌ర‌ల్ మాట్లాడుతూ.. బ‌ల‌ప‌రీక్ష‌ను ర‌హ‌స్య బ్యాలెట్ ద్వారా నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టును కోరారు. క‌ర్ణాట‌క అసెంబ్లీలో ప్ర‌స్తుతం బీజేపీకి మొత్తం 105 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంది. వాస్త‌వానికి 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెల‌వ‌గా.. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లుగా చెబుతున్నారు. గురువారం నుంచి కాంగ్రెస్ పార్టీకి అందుబాటులోకి రాని నేప‌థ్యంలో.. ఆయ‌న బీజేపీ వైపు వెళ్లిపోయిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

ఇక‌.. సుప్రీంకోర్టులో వాద‌నల సంద‌ర్భంగా కాంగ్రెస్‌.. జేడీఎస్ త‌ర‌ఫు న్యాయ‌వాది త‌మ‌కు 116 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని ధ‌ర్మాస‌నానికి తెల‌ప‌గా.. బీజేపీ త‌ర‌పు న్యాయ‌వాది రోహ‌త్గి త‌మ‌కూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లం ఉంద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి ఎస్ ఆర్ బొమ్మై కేసును.. స‌ర్కారియా క‌మిష‌న్ సూచ‌న‌ల్ని సైతం ప్ర‌స్తావించారు. కాంగ్రెస్‌.. జేడీఎస్ ల కూట‌మి అప‌విత్ర‌మైన‌ద‌ని ఆయ‌న వాదించారు. దీనికి స్పందించిన అభిషేక్ సింఘ్వి ఏ పార్టీ అధికారాన్ని చేప‌ట్టాలో? ఏ పార్టీ చేప‌ట్ట‌కూడ‌దో సుప్రీం కోర్టు డిసైడ్ చేయాల‌న్నారు. ఇదిలా ఉంటే.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప్ర‌భుత్వ ఏర్పాటు గురించి గ‌వ‌ర్న‌ర్ కు సీఎం య‌డ్యూర‌ప్ప రాసిన లేఖ‌ల్ని ధ‌ర్మాస‌నం ప‌రిశీలించింది. త‌మ‌కు ఎంత మంది స‌భ్యుల మ‌ద్ద‌తు ఉంద‌న్న వివ‌రాల్ని అందులో పేర్కొన‌లేద‌ని వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క రాజకీయం మొత్తం నెంబ‌ర్ గేమ్ మీద ఆధార‌ప‌డి ఉన్న‌ట్లుగా వ్యాఖ్యానించింది. క‌ర్ణాట‌క‌లో య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వం శ‌నివారం సాయంత్రం బ‌ల‌ప‌రీక్ష‌ను నిరూపించుకోవాల‌ని సుప్రీం చెప్ప‌గా కాంగ్రెస్ త‌ర‌ఫు న్యాయ‌వాది సింఘ్వీ ఓకే చెప్పారు. బీజేపీ త‌ర‌ఫు న్యాయ‌వాది రోహిత్గి మాత్రం మ‌రో మూడు రోజులు అద‌నంగా స‌మ‌యం కావాల‌ని కోరారు. ఆయ‌న మాట‌తో ఏకీభ‌వించ‌ని కోర్టు.. శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించాల‌ని కోరారు.